Israel-Hamas : ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం.. బందీలు దశలవారీగా విడుదల!
Israel-Hamas : పశ్చిమాసియాలో కీలక పరిణామం జరిగింది. ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ సాధ్యమైంది.
గాజాలో 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మధ్యవర్తులు బుధవారం ఈ సమాచారం ఇచ్చారు. దీంతో బందీల విడుదలకు మార్గం సుగమమైంది. ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ సాధ్యమైంది. డోనాల్డ్ ట్రంప్ సింహాసనాన్ని అధిష్టించడానికి ముందు జరిగిన ఈ కాల్పుల విరమణ జో బైడెన్ ప్రభుత్వానికి పెద్ద విజయం. అంతకుముందు ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది.

హమాస్ కొత్త షరతులు విధించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ కాల్పుల విరమణను అడ్డుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజా నివేదిక ప్రకారం కాల్పుల విరమణకు ఇరు పక్షాలు అంగీకరించాయి.
బందీల విడుదల
ఖతార్ రాజధాని దోహాలో వారాల పాటు జరిగిన చర్చల అనంతరం కుదిరిన ఈ ఒప్పందంలో హమాస్ బందీలను దశలవారీగా విడుదల చేయడం, ఇజ్రాయెల్ లోని వందలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం, వేలాది మంది నిర్వాసితులను గాజాకు తిరిగి తీసుకురావడం వంటివి ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతానికి అవసరమైన సహాయం కూడా అందుతుంది.
ముగ్గురు అమెరికా అధికారులు, ఒక హమాస్ అధికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ధృవీకరించారు. దోహాలో మధ్యవర్తులు అధికారిక ప్రకటన చేయడానికి ముందు ఈ ఒప్పందం విధివిధానాలపై చర్చించడానికి ముగ్గురు అమెరికా అధికారులు వ్యక్తిగతంగా మాట్లాడారు.
మెుత్తం యుద్ధం ఆపేందుకు
ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం అవసరం. అయితే రాబోయే రోజుల్లో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం మొదటి ఆరు వారాల పాటు యుద్ధం ఆగిపోతుందని, దీనితో యుద్ధాన్ని పూర్తిగా ముగించే చర్చలు ప్రారంభమవుతాయని అనుకుంటున్నారు.
దాడుల్లో ఎంతోమంది
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని హతమార్చగా, 250 మందిని బందీలుగా తీసుకుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ మళ్లీ దాడులు జరిపి 46,000 మందికి పైగా పాలస్తీనియన్లను పొట్టనబెట్టుకుందని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. గాజా జనాభాలో 90 శాతం మంది నిర్వాసితులయ్యారు. సంక్షోభం ఏర్పడింది. 2023 నవంబర్‌లో వారం రోజుల పాటు జరిగిన కాల్పుల విరమణ సందర్భంగా గాజా నుంచి 100 మందికి పైగా బందీలను విడుదల చేశారు.