Y chromosome: ‘‘త్వరలో ‘వై’ క్రోమోజోమ్ అంతర్ధానం.. ఇక మగ జాతికి అంతం తప్పదు’’; సైంటిస్ట్ ల హెచ్చరిక
స్త్రీ, పురుషుల్లో తేడాను నిర్ధారించే ఎక్స్, వై క్రోమోజోముల గురించి తెలుసు కదా. రెండు ఎక్స్ క్రోమోజోములు స్త్రీ ని, ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఒక వై క్రోమోజోమ్ పురుషుడిని నిర్ధారిస్తాయి. అయితే, మేల్ క్రోమోజోమ్ గా పిలిచే వై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధానమవుతోందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
మగవారికి సాధారణంగా ఒక X మరియు ఒక Y క్రోమోజోమ్ (XY), ఆడవారికి రెండు X క్రోమోజోమ్‌లు (XX) ఉంటాయి. అయితే, ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మానవులలోని రెండు సెక్స్ క్రోమోజోమ్‌లలో ఒకటైన Y క్రోమోజోమ్ క్రమంగా కనుమరుగవుతుందని జీవశాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ క్రోమోజోమ్ పూర్తిగా అదృశ్యమైతే భవిష్యత్తులో మగ సంతానం అంతం అవుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
కానీ, కొంత ఆశ ఉంది..
అయితే, మగజాతి అంతం అవుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మరో ఆశ కూడా ఉందని అదే శాస్త్రవేత్తలు తెలిపారు. వై క్రోమోజోమ్ స్థానంలో అవే లక్షణాలతో మరో కొత్త క్రోమోజోమ్ రూపొందుతుందని వెల్లడించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్‌లో దీనికి సంబంధించిన ఒక పేపర్ ను ప్రచురించారు. ఆ అధ్యయనం ప్రకారం.. జపాన్‌కు చెందిన ఎలుకల జాతి, దాని Y క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధానమైనందున, మరో కొత్త మగ జన్యువును అభివృద్ధి చేసుకుంది. అంటే, రాబోయే మిలియన్ల సంవత్సరాలలో మన Y క్రోమోజోమ్ కనుమరుగైనా.. అవే లక్షణాలతో మరో మేల్ క్రోమోజోమ్ ను రూపొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎక్స్, వై క్రోమోజోమ్స్ అంటే ఏమిటి?
ఎక్స్, వై అనేవి మనుషుల్లోని రెండు సెక్స్ క్రోమోజోములు. ఫలదీకరణ సమయంలో రెండు ‘X’ క్రోమోజోముల కలయిక వల్ల ఆడ శిశువు.. ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోముల కలయిక వలన మగ శిశువు రూపొందుతుంది. ‘Y’ క్రోమోజోమ్ వృషణాలు వంటి పురుష పునరుత్పత్తి కణజాలాల అభివృద్ధికి కీలకమైన జన్యువులను కలిగి ఉంటుంది. అయితే, ఈ రెండు క్రోమోజోమల్లో జన్యువుల సంఖ్యలో చాలా తేడా ఉంటుంది. ‘X’ క్రోమోజోమ్ కన్నా ‘Y’ క్రోమోజోమ్ చిన్నగా ఉంటుంది. ఎక్స్ క్రోమోజోములో ఎక్కువ సంఖ్యలో జన్యువులు లేదా జీన్స్ ఉంటాయి. ఎక్స్ తో పోలిస్తే, వై క్రోమోజోమ్ లో తక్కువ సంఖ్యలో జీన్స్ ఉంటాయి.
మిలియన్ల సంవత్సరాల తరువాతే..
గత కొన్ని లక్షల సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువల సంఖ్య మరింత తగ్గింది. వాస్తవానికి ‘Y’ క్రోమోజోములో 1438 జన్యువులుంటాయి. కానీ, గత 300 మిలియన్ సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువుల (Genes) సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అంటే, 1393 జీన్స్ కనుమరుగయ్యాయి మరో 11 మిలియన్ల సంవత్సరాల్లో ఆ మిగిలిన 45 జన్యువులు కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది. జెనెటిక్స్ ప్రొఫెసర్, సైంటిస్ట్ జెన్నిఫర్ ఎ మార్షల్ గ్రేవ్స్ ఈ అంశాలను వెల్లడించారు.
‘Y’ క్రోమోజోమ్ స్థానంలో మరొకటి..
జపాన్ లోని హక్కైడో విశ్వవిద్యాలయంలో అసటో కురోయివా నేతృత్వంలోని పరిశోధకులు స్పైనీ ఎలుకలలోని చాలా Y క్రోమోజోమ్ జన్యువులు ఇతర క్రోమోజోమ్‌లకు మారినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా, వారు క్రోమోజోమ్ 3పై SOX9 జన్యువు దగ్గర చిన్న DNA ను గుర్తించారు. ఇది మగవారిలో ఉంటుంది కానీ ఆడవారిలో ఉండదు. ఈ డూప్లికేషన్ SOX9ని యాక్టివేట్ చేస్తుంది. ఇది పురుష అభివృద్ధిలో తప్పిపోయిన SRY జన్యువు పాత్రను తీసుకుంటుంది. Y క్రోమోజోమ్ కోల్పోయినప్పుడు క్షీరదాలు ప్రత్యామ్నాయ లింగాన్ని నిర్ణయించే విధానాలను అభివృద్ధి చేయగలవని ఈ అధ్యయనం చెబుతోంది. మరొక చిట్టెలుక జాతి, మోల్ వోల్ కూడా దాని Y క్రోమోజోమ్‌ను కోల్పోయిన తరువాత కూడా మనుగడలో ఉంది.