మహా కుంభమేళా ట్రాఫిక్ సమస్యతో ప్రయాగ్‌రాజ్ సరిహద్దులు మూసివేశారా?
Maha Kumbh Fact Check : మాఘ పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళాకు లక్షలాది భక్తులు తరలివెళ్తున్నారు. ఇప్పటికే మేళా ప్రాంగణాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రయాగ్‌రాజ్ సరిహద్దులు మూసివేశారని కొందరు ప్రచారం చేస్తున్నారు.

మాఘ పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళాలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం తెల్లవారుజామున పవిత్ర స్నానం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుండి మహా కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ ప్రకటించారు. అత్యవసర, అవసరమైన సేవలకు మినహాయింపు ఇచ్చారు.
సరిహద్దులు మూసేశారా?
మహా కుంభమేళాలో మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు స్నానమాచరించారు. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. భారీ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలులో ఉన్నాయి. ఇప్పటికే నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. అయితే కొందరు ప్రయాగ్‌రాజ్ సరిహద్దులు మూసివేశారని పుకార్లు లేపారు. ఈ విషయంపై ప్రయాగ్‌రాజ్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మందర్ స్పందించారు. ప్రజలు నిబంధనలను పాటించాలని, నగర సరిహద్దులను మూసివేశారనే పుకార్లను పట్టించుకోవద్దని కోరారు.
పుకార్లు నమ్మెుద్దు
'ప్రయాగ్‌రాజ్ సరిహద్దును మూసివేయడం గురించి చర్చల విషయానికొస్తే, కొందరు ఈ పుకారు వ్యాప్తి చేస్తున్నారు. అది నిజం కాదు, దానిని ఎప్పుడూ మూసివేయలేదు.' అని ప్రయాగ్‌రాజ్ డీఎం రవీంద్ర కుమార్ మందర్ బుధవారం అన్నారు. మహా కుంభమేళాను సందర్శించే భక్తులు అధికారులు చెప్పేవాటిని మాత్రమే విశ్వసించాలని కోరారు.
'ప్రజలు పుకార్లను పట్టించుకోకూడదని నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. అధికారిక యంత్రాంగం వెర్షన్‌ను మాత్రమే అనుసరించాలి. రైల్వే ఆపరేషన్ సజావుగా సాగుతుంది. మేళా ప్రాంతానికి సమీపంలో ఉన్న సంగం స్టేషన్ గతంలో కూడా మూసివేసేవారు. అన్ని స్టేషన్లలో విశ్రాంతి కార్యకలాపాలు సాధారణంగానే ఉంటాయి.' రవీంద్ర కుమార్ అన్నారు.
మాఘ పౌర్ణమి స్నానానికి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని, పార్కింగ్ స్థలాలను మాత్రమే ఉపయోగించాలని అధికారులు కోరుతున్నారు.
నో వెహికల్ జోన్
మాఘ పౌర్ణమి వేళ భక్తుల రాకతో కుంభమేళాకు సమీపంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం 4 గంటల నుండి జాతర ప్రాంతాన్ని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించారు. ఫిబ్రవరి 12న భక్తులు సులభంగా మేళా ప్రాంతాన్ని ఖాళీ చేసేవారు ఈ నియమం అమల్లో ఉంటుందని చెప్పారు. అత్యవసర, అవసరమైన సేవలకు మినహాయింపు ఇచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే చివరి 'అమృత స్నానం'తో మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది.