Opinion: తొలగుతున్న అచ్చేదిన్ భ్రమలు
‘మోడీ పిలుపునిచ్చిన ‘అచ్చేదిన్’ అసలు రాకముందే చెడ్డరోజులు రాబోతున్నాయా అనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చర్ ఐవీ మురళీ కృష్ణ విశ్లేషణ.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టగలదా అనే సందేహాలు అక్కడక్కడా వ్యక్తమవుతున్నాయి. మోడీ పిలుపునిచ్చిన ‘అచ్చేదిన్’ అసలు రాకముందే చెడ్డరోజులు రాబోతున్నాయా అనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది సంవత్సరాలు ఏకదాటిగా దేశాన్ని ఏలిన బీజేపీకి కన్నడిగుల తీర్పు వారి పతనానికి సంకేతాలుగా భావించవచ్చనే వ్యాఖ్యలు ప్రారంభమయ్యాయి.
మాతృసంస్థ జనసంఘ్ భావజాలంతో 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన ఆ పార్టీ 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత 1989 నుండి దేశంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తనకు అనుకూలంగా మల్చుకుంది. రాజకీయ ఎదుగుదలకు హిందు భావజాలాన్నే నమ్ముకున్న బీజేపీ బలోపేతానికి అప్పటి పార్టీ అగ్రనేతలు అటల్‌బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ 1990 దశకంలో ‘రామ్, రోటీ’ అనే నినాదాలను ఎత్తుకున్నారు.
మాజీ ప్రధాని వి.పి.సింగ్ ప్రవేశపెట్టిన మండల కమిషన్‌ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు అయోధ్య రామాలయం అంశాన్ని విజయవంతంగా వినియోగించుకున్నారు. అయోధ్యలో రామాలయం, జమ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, కామన్ సివిల్ కోడ్ వంటి సున్నితమైన అంశాలు బీజేపీకి రాజకీయ సోపానాలుగా ఉపయోగపడ్డాయి. వారి నినాదంలో ఒకటైన ‘రోటీ’ (అందరికీ ఆహారం) మాత్రం అటకెక్కింది.
అయోధ్య, కాశ్మీర్, కామన్ సివిల్ కోడ్ అంశాలకు బీజేపీ మాత్రమే సరైన పరిష్కారం చూపించగలదనే భావనను దేశంలోని ఒక వర్గం విశ్వసించేలా చేయడంలో ఆ పార్టీ నూటికి నూరు శాతం విజయవంతం అయ్యింది. మరోవైపు పాకిస్థాన్ పట్ల కఠినంగా వ్యవహరించడంలో ఇందిరాగాంధీ తర్వాత బీజేపీనే సరైనదే అభిప్రాయాన్ని కూడా కలిగించడంలోనూ ఆ పార్టీ సక్సెస్ అయ్యింది.
వాజ్‌పేయి నేతృత్వంలో 1998-2004 మధ్య ఏర్పడిన ఎన్‌డిఏ ప్రభుత్వం రామాలయం, కాశ్మీర్ అంశాలను పట్టించుకోలేదనే అసంతృప్తి ఆ వర్గంలో ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఈ సున్నితమైన అంశాలపై దృష్టి పెట్టలేకపోయామని సర్దిచెప్పుకున్న అప్పటి బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధిని కూడా నిర్లక్ష్యం చేయడంతో ఆ పార్టీ వరుసగా రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడం, దీనికి తోడు సున్నితమైన అంశాలను బీజేపీ సజీవంగా ఉంచడంతో పాటు ‘అచ్చే దిన్’ నినాదంతో బీజేపీ సంపూర్ణ మెజార్టీతో 2014లో అధికారంలోకి వచ్చింది. వీటికి తోడు నల్లడబ్బును వెలికితీస్తామని బీజేపీ ఇచ్చిన పిలుపుతో మధ్య తరగతి కూడా సానుకూలంగా మారడం ఆ పార్టీకి కలిసివచ్చింది.
దేశ ప్రజల జీవితాలు మారాయా?
నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ‘అచ్చేదిన్’ అంటే తమ జీవితాలు మారుతాయని దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి భ్రమలు తొలగి జీవన ప్రమాణాలు రోజురోజుకు దిగజారుతుండడంతో ప్రభుత్వం మన కోసం చేస్తున్న మంచి ఏమిటి అనే ప్రశ్న సామాన్యులలో ప్రారంభమైంది.
నల్లడబ్బు వెలికి తీస్తే దేశంలో మార్పులు సంభవిస్తాయని భావించిన ప్రజలు బీజేపీ ప్రభుత్వం 2016 నవంబర్‌లో తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం తమ జీవితాల బాగుకే అని భావించారు. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా అకస్మికంగా తీసుకున్న ఈ భారీ నిర్ణయంతో దేశప్రజలు అనేక ఇబ్బందులు ఎదురైనా, నల్లడబ్బు వెలికితీతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ చేసిన ప్రచారాన్ని విశ్వసించి పలు కష్టాలను భరించారు.
పెద్ద నోట్ల రద్దు ప్రయోగం విఫలమైనా పాకిస్తాన్‌పై మోడీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో 2019 ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం హయాంలో అయోధ్య రామాలయంపై ఉన్నత న్యాయ స్థానం తీర్పు హిందూ సంస్థలకు అనుకూలంగా రావడంతో రామాలయం మందిరం నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఇక్కడ ప్రత్యక్షంగా మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేకపోయినా ఆయన హయాంలో తీర్పు రావడంతో రామాలయం నిర్మాణానికి మోడీనే కృషి చేశారని బీజేపీ ప్రచారం చేసి తమకు అనుకూలంగా మల్చుకోవడంలో విజయవంతం అయ్యింది.
జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అంశాలను కూడా బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుంది. బీజేపీ నుండి ఒక వర్గం ఆశించిన సున్నితమైన అంశాల్లో కామన్ సివిల్ కోడ్ మినహా మిగతావి పూర్తయిన పిమ్మట దేశ ప్రజలు మన బాగోగుల కోసం ఈ ప్రభుత్వం ఏమి చేసిందనే ఆలోచనతో ‘అచ్చేదిన్’పై దృష్టి సారించారు. ఆర్థిక భారంతో దినదినగండంగా బతుకులను వెళ్లదీస్తున్న పేదలు ‘జై బజరంగ్ బలీ’ వంటి భావోద్వేగాలను పక్కనపెట్టి ఈ ప్రభుత్వం మనకు చేస్తుందేమిటనే ప్రశ్న లేవనెత్తారనటానికి కర్ణాటక ఓటర్ల తీర్పు నిదర్శనం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు ఇలాంటి ఆలోచనలతోనే ఉండడం ఆ పార్టీకి ఒక హెచ్చరికనే.
పట్టాలు తప్పిన డబుల్ ఇంజిన్
కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందని బీజేపీ చేసే ‘డబుల్ ఇంజిన్’ ప్రచారం కర్ణాటకలో పట్టాలు తప్పింది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నా సామాన్య ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోవడానికి ప్రధాన కారణం ధరల పెరుగుదలే. గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలతో మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఎన్నికల సమయాల్లో మినహా మిగతా రోజుల్లో కొండలా పెరుగుతున్న చమురు ధరల ప్రభావంతో అన్ని నిత్యావసర ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో సామన్య ప్రజలకు రోజులు గడపడమే గగనంగా మారడంతో కన్నడిగులు బీజేపీకి షాకిచ్చారు. గ్యాస్, చమురు ధరల నిర్ణయాలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉంటాయని తప్పించుకునే బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజల నుండి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.
అన్ని రకాల వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన కేంద్రం ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చమురు రంగాన్ని మాత్రం ఎందుకు విస్మరిస్తుందనే ప్రశ్నలు అన్నివైపుల నుండి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సానుకూలంగా లేవని కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రభుత్వాలే ఉన్నా ఆ పార్టీ కేంద్ర నాయకత్వం వీటిని జీఎస్టీ పరిధిలోకి తేవడానికి ఆ రాష్ట్రాలను ఎందుకు ఒప్పించడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ధరల పెరుగుదల అంశాన్ని రాష్ట్ర, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కర్ణాటకలో మోడీ ‘డబుల్ ఇంజిన్’ పట్టాలు తప్పింది.
బీజేపీలో అందరూ సచ్చీలురేనా..?
కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండో పర్యాయం అధికారం చేపట్టాక పలువురిపై ప్రధానంగా ప్రత్యర్థి రాజకీయ నేతలపై సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ ఏజెన్సీల దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కేంద్రం కక్షగట్టి వేధిస్తుందని ప్రశ్నిస్తే అవినీతి పరులను సమర్థిస్తారా అని బీజేపీ ఎదురు ప్రశ్నిస్తోంది. దేశంలో ప్రతిపక్ష నాయకులే అవినీతిపరులా..? స్వపక్షంలో అవినీతి పరులు లేరా..? కర్ణాటకలో బీజేపీ ఓటమికి ‘40% కమిషన్ సర్కారు’ కూడా ఒక కారణం కాదా..? మరి కర్ణాటకలో ఎంత మంది బీజేపీ నేతలపై సిబిఐ, ఈడి దాడులు జరిగాయి..? సామాన్యుల నుండి వెలువడే ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు.
అదానీ వంటి బడా పారిశ్రామిక వేత్తలను మోడీ ప్రభుత్వం వెనకేసుకొస్తున్న తీరు బహిరంగ రహస్యమే. మోడీ అధికారం చేపట్టాక మొండి బకాయిల పేరిట ఎంత మంది బడా వ్యాపారస్తుల రుణాలను మాఫీ చేసిందో తెలిసిన విషయమే. సోషల్ మీడియా పుణ్యమా అని వీటిపై సామాన్యులకు కూడా అనేక విషయాలు తెలుస్తుండడంతో అసలు అవినీతి అంటే అది ఏ రూపంలో ఉంటుందో అర్థం కావడం లేదు. ఆర్థిక విషయాలే కాకుండా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ చూపించే అత్యుత్సాహంపై కూడా ప్రజల్లో ఏహ్యభావ్యం కలుగుతుంది. మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, గతంలో కర్ణాటక రాష్ట్రాలలో రాజకీయ అనిశ్చితి కల్పించి బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటకు ఆ పార్టీ చేసిన ప్రయత్నాలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. అవకాశం వస్తే ప్రభుత్వాని ఏర్పాటు చేయాలి, అంతేకానీ ఎప్పుడూ మేమే అధికారంలో ఉండాలనే భావనతో ఎంతకైనా తెగించే బీజేపీ వైఖరి ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుంది.
మార్పు రాకుంటే అంతే సంగతులు
బీజేపీ ప్రభుత్వం అనేక విషయాలపై మొండి వైఖరిని ప్రదర్శిస్తుంటుంది. పెద్ద రాష్ట్రం కావడంతో ముందు చూపుతో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు రైతు చట్టాలను మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెనక్కు తీసుకుంది. పలు విషయాల్లో మోడీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని కర్ణాటక ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. రామాలయం, కాశ్మీర్, పాకిస్థాన్ వంటి సున్నితమైన అంశాలు ప్రజల అవసరాలను తీర్చలేవు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రధానంగా ధరలను నియంత్రించకపోతే ఎన్నికలు`ఫలితాల పరంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
భావోద్వేగాలపై ఆధారపడడం అలవాటుపడిన బీజేపీ కామన్ సివిల్ కోడ్ వంటి మరో వివాదాస్పద అంశాన్ని ఎన్నికల ముందు లేవనెత్తి గట్టెక్కాలని చూడొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల బాగోగులను పట్టించుకోకుండా అవకాశవాద రాజకీయాలతోనే కొనసాగితే సంవత్సరం చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ డబుల్ ఇంజిన్ పట్టాలు తప్పొచ్చు. దానికి తోడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇంతకాలం తాము ప్రచారం చేస్తున్న ‘అచ్చేదిన్’ కాస్తా ‘బురేదిన్’గా మారొచ్చు.
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ,
మొబైల్ నెం: 9949372280