‘మాంగా ప్రెడిక్షన్’తో జపాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జులై 5న అతిపెద్ద భూకంపం సంభవిస్తుందని మాంగా ప్రెడిక్షన్ చెప్పడంతో అందరు భయపడిపోతున్నారు. కాగా వారం రోజులుగా జపాన్ని భూ ప్రకంపనలు వణికిస్తూనే ఉన్నాయి. 1000కిపైగా భూ ప్రకంపనలతో ప్రజలు అల్లాడిపోయారు.
జపాన్‌లోని కగోషిమా ప్రిఫెక్చర్‌లోని టోకారా దీవుల్లో గత రెండు వారాల్లో 1000కి పైగా భూకంపాలు సంభవించాయి. గురువారం (జులై 3) సంభవించిన భూకంపం ఎంత బలంగా ఉందంటే ప్రజలు నిలబడటానికి కూడా ఇబ్బంది పడ్డారు! వరుస భూకంపాల నేపథ్యంలో, జపాన్ ప్రభుత్వం ఈ మారుమూల దీవుల నివాసితులకు నైరుతి దిశలో ఉన్న సముద్ర జలాల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
దక్షిణ జపాన్‌లోని ప్రధాన ద్వీపం క్యూషు చివరన, 5.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కేంద్రానికి సమీపంలో ఉన్న దీవుల నుంచి ప్రజలను అధికారులు శుక్రవారం తరలించారు. ఈ 12 దీవుల్లోని ఏడింటిలో సుమారు 700 మంది నివసిస్తున్నారు. వీటిలో కొన్నింటికి సమీపంలో ఆసుపత్రులు కూడా లేవు!
గతంలో కూడా ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవించినప్పటికీ, ఇటీవల భూప్రకంపనల తీవ్రత, వాటి సంఖ్య అసాధారణంగా ఉందని స్థానిక మీడియా నివేదించింది. ఒక నివాసి భూకంపం సంభవించడానికి ముందు తమ అనుభవాన్ని "వింతైనది"గా అభివర్ణించారు. "ముఖ్యంగా రాత్రిపూట భూకంపాలు సంభవించడానికి ముందు సముద్రం నుంచి వింతైన శబ్దం వస్తోంది," అని ఆ నివాసి మీడియాకి తెలిపారు.
భూకంపాల సంఖ్య పెరుగుతున్న వేళ.. ఒక కామిక్ పుస్తకం అంచనా జపాన్‌లో "తీవ్రమైన భూకంపం" వస్తుందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది! మాంగా ఆర్టిస్ట్ రియో టాట్సుకి రాసిన 1999 నాటి కామిక్ పుస్తకం (2021లో దీని కొత్త ఎడిషన్ విడుదలైంది), ఈ సంవత్సరం జులై 5న జపాన్‌లో తదుపరి పెద్ద భూకంపం వస్తుందని పేర్కొంది.
ఈ మాంగా అంచనాల కారణంగా నివాసితులతో పాటు పర్యాటకులు కూడా జపాన్‌ను సందర్శించడం మానుకుంటున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, మే నెలలో హాంగ్ కాంగ్ నుంచి జపాన్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 11% తగ్గింది!
అంతేకాకుండా, దశాబ్దాలుగా దేశంలోని అధికారులు "పెద్ద భూకంపం" లేదా "మెగాక్వేక్" కోసం సిద్ధమవుతున్నారని మీడియా తెలిపింది. అయితే, పెద్ద విపత్తు వస్తుందనే అంచనాలను నమ్మవద్దని అధికారులు నివాసితులకు విజ్ఞప్తి చేశారు. జపాన్ మెటియోరోలాజికల్ ఏజెన్సీ భూకంప, సునామీ పర్యవేక్షణ విభాగం డైరెక్టర్ అయతకా ఎబితా మాట్లాడుతూయయ ప్రస్తుత శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడా భూకంపం "ఖచ్చితమైన సమయం, ప్రదేశం లేదా పరిమాణాన్ని" అంచనా వేయడం కష్టం అని అన్నారు. అయితే, ప్రజలు శాస్త్రీయ ఆధారాలను బట్టి తమ అవగాహనను ఏర్పరచుకోవాలని ఎబితా కోరారు.
ఇదిలా ఉండగా, తన ప్రచురణకర్త విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. మాంగా ఆర్టిస్ట్ టాట్సుకి కూడా తాను "ప్రవక్తను కాదు" అని చెబుతూ అన్ని వదంతులను తిరస్కరించారు.
భూకంపాల దృష్ట్యా జపాన్ ప్రభుత్వం కట్టల నిర్మాణం, భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయడం వంటి అనేక చర్యలను ప్రకటించింది. ఇది దేశంలో ఏ విధమైన విపత్తునైనా ఎదుర్కోవడానికి సంసిద్ధతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
సంబంధిత కథనం