ారతీయ రైల్వే నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడం సామాన్య ప్రయాణికులకు కొన్నిసార్లు ఇబ్బంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ irctc.co.inలో ప్రయత్నిస్తారు. కానీ వెబ్‌సైట్ హ్యాంగింగ్, స్లో స్పీడ్, బాట్స్ కారణంగా చాలాసార్లు టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పుడు ఈ సమస్యను తొలగించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
తక్షణ టికెట్ బుకింగ్ కోసం భారతీయ రైల్వే త్వరలో ఇ-ఆధార్ ధృవీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. నకిలీ ప్రయాణికులు, దళారులను నిరోధించడం, నిజమైన ప్రయాణికులకు ప్రాధాన్యమివ్వడం దీని ఉద్దేశం. తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం భారతీయ రైల్వే త్వరలో ఇ-ఆధార్ ధృవీకరణను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల అవసరమైన, నిజమైన ప్రయాణికులు కన్ఫర్మ్ టికెట్లు పొందవచ్చు.
ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ప్రయాణికుడికి ఓటీపీ వస్తుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వెరిఫైడ్ యూజర్లకు ఇన్ స్టంట్ టికెట్ బుకింగ్ లభిస్తుంది.
ఆధార్‌తో వెరిఫై చేయని వినియోగదారులు ఐఆర్సీటీసీలో నమోదు చేసుకున్న 3 రోజుల తర్వాత మాత్రమే తత్కాల్, ప్రీమియం తత్కాల్ లేదా ఏఆర్పీ టికెట్లను బుక్ చేయగలరని ఐఆర్సీటీసీ తెలిపింది. అయితే, ఆధార్ ధృవీకరించిన వినియోగదారులకు అటువంటి పరిమితి ఉండదు. ఏఐ టెక్నాలజీ సహాయంతో 2.5 కోట్లకు పైగా నకిలీ, అనుమానాస్పద ఐఆర్సీటీసీ యూజర్ ఐడీలను గుర్తించి నిలిపివేసినట్లు రైల్వే తెలిపింది.
తత్కాల్ టికెట్లు బుక్ చేసిన మొదటి 5 నిమిషాల్లో 50 శాతం లాగిన్ ప్రయత్నాలు బోట్స్ ద్వారా జరుగుతాయని, తద్వారా నిజమైన ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోలేరని ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఇప్పుడు రైల్వే శాఖ యాంటీ బోట్ విధానాన్ని అమలు చేసింది. పెద్ద కంటెంట్ డెలివరీ నెట్ వర్క్ (CDN) సేవతో భాగస్వామ్యం అయింది. సర్వర్ కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంది.
త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి తేదీని అధికారికంగా ప్రకటించలేదు. అంతకు ముందు ప్రయాణికులు ఐఆర్సీటీసీ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవడం మంచిది. మీ మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండేలా చూసుకోండి. కొత్త వినియోగదారు అయితే, వీలైనంత త్వరగా నమోదు చేసుకోండి.