పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్థాన్‌లు దాదాపు యుద్ధం అంచు వరకు వెళ్లాయి. శనివారం సాయంత్రం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగాయి. వీటి వల్ల పాకిస్థాన్‌కి చాలానే నష్టం జరిగింది. వీటన్నింటి మధ్య సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం విపరీతంగా వ్యాపించింది. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌లో పరిస్థితులు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. బెంగళూరు 'పోర్టు'ను పాక్ నేవీ ధ్వంసం చేసిందంటూ అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు! ఈ వ్యవహారం ఎక్స్‌లో వైరల్ అయ్యింది. అది గమనించిన భారతీయులు పాకిస్థానీలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలేం జరిగిందంటే..
బెంగళూరు ఓడరేవును పాకిస్థాన్ నావికాదళం 'నాశనం' చేసినందుకు సంబరాలు చేసుకున్న పాకిస్థానీయులను సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా సహా వేలాది మంది భారతీయులు ట్రోల్ చేశారు.
వాస్తవానికి, బెంగళూరు - కర్ణాటక రాజధాని - తీరానికి కనీసం 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పలువురు పాకిస్థానీలు, పాక్ మద్దతుదారులు తమ నౌకాదళం బెంగళూరు పోర్టును ధ్వంసం చేసిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. అలాంటి ఓ కామెంట్ స్క్రీన్ షాట్‌ను భారత సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు.
'బెంగళూరు పోర్టును పాక్ నావికాదళం ధ్వంసం చేసింది' అని ఫవాద్ యువర్ రెహ్మాన్ అనే వ్యక్తి కామెంట్ చేశాడు. దీంతో ఆయన కామెంట్ ఒక్కసారిగా తీవ్ర ట్రోలింగ్కి గురైంది.
'బెంగళూరులో యూఎస్బీ పోర్టులు మాత్రమే ఉన్నాయి,' అంటూ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా సరదాగా స్పందించారు.
ఐఏఎస్ అవనీష్ శరణ్ తన ఎక్స్ పోస్టుకు సమాధానమిస్తూ, "పట్నా సముద్ర రేవును కూడా నాశనం చేశారు," అని పేర్కొన్న మరొక వైరల్ స్క్రీన్ షాట్‌పై విరుచుకుపడ్డారు. బిహార్‌లోని పట్నా కూడా పోర్టు లేదు.
పాకిస్థానీల వింత వాదనలను తోసిపుచ్చడానికి ప్రజలు వ్యంగ్యంగా స్పందించారు.
“నిజమే నేను మన్యత బీచ్‌లో మార్నింగ్ కాఫీ తాగుతున్నప్పుడు పేలుడు శబ్దాలు వినిపించాయి. మరతహళ్లి షిప్‌యార్డు, సిల్క్ బోర్డ్ హార్బర్‌ని కూడా టార్గెట్ చేశారు,” అని బెంగళూరులోని ప్రాంతాల పేర్లను ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు.
“నేను బెంగళూరు సీ పోర్టులోనే ఉన్నాను. నా కోసం ప్రార్థనలు చేయండి,” అని మరొక యూజర్ వ్యంగ్యంగా స్పందించాడు.
భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అనేక తప్పుడు వాదనలను తిప్పికొట్టేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. పలు యుద్ధ గేమింగ్ వీడియోలను భారత్-పాక్ ఘర్షణకు సంబంధించిన రియల్ వీడియోలుగా ఆన్లైన్లో షేర్ చేస్తున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇటీవల ఓ పోస్ట్‌లో చెప్పింది.
నాలుగు రోజులుగా సీమాంతర డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో భూ, వాయు, సముద్ర సరిహద్దుల్లో యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత్, పాకిస్థాన్ దేశాలు అంగీకరించాయి. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే జమ్ముకశ్మీర్ లో వరుస డ్రోన్ దృశ్యాలు, ఆ తర్వాత పేలుళ్ల శబ్దాలు రావడంతో భద్రతా సిబ్బంది వాటిని కూల్చివేసేందుకు వైమానిక రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపారు.
సంబంధిత కథనం
టాపిక్