ప్రస్తుతం అన్ని వర్గాలు, అన్ని వయస్సుల వారిని ఊబకాయం (obesity) సమస్య ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా జీవన శైలి మార్పులు, జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం సాధారణమైంది. దాంతో, చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక రోజులో ఆహారం తీసుకునే సమయాన్ని పరిమితం చేయడాన్ని, తద్వారా కేలరీలను స్వీకరించడాన్ని తగ్గించడాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting) అంటారు. ఈ విధానంలో రోజులోని 24 గంటల్లో కేవలం 8 లేదా 6 గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకుని, మిగతా 16 లేదా 18 గంటల పాటు నీరు తప్ప ఏ ఆహారం తీసుకోకూడదు. ఇలా ఆహారాన్ని నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం ద్వారా బరువు తగ్గవచ్చని నిరూపణ కావడంతో చాలామంది ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు.
అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting) చేస్తున్న, లేదా చేయాలని భావిస్తున్నవారికి షాక్ ఇచ్చే వార్తను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం ఏకంగా 91% పెరిగిందని వెల్లడించింది. భోజన సమయాలను రోజుకు కేవలం ఎనిమిది గంటల వ్యవధికి పరిమితం చేయడం వల్ల గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదం 91% పెరిగిందని చికాగోలో సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. విడుదల చేసే ముందు ఈ నివేదికను ఇతర నిపుణులు సమీక్షించారని ఏహెచ్ఏ తెలిపింది. అయితే, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈ నివేదికను పూర్తిగా ప్రచురించలేదు. కేవలం అబ్ స్ట్రాక్ట్ ను మాత్రమే ప్రచురించింది. దాంతో, కొంతమంది వైద్యులు అధ్యయనం యొక్క ఫలితాలను ప్రశ్నించారు. అధ్యయనంలో సర్వే చేసిన వ్యక్తుల ఆరోగ్యాల మధ్య పోలికలు, తేడాలను, వారి ఇతర అనారోగ్య సమస్యలను పరిశీలించారా? అని ప్రశ్నించారు.
"కేలరీల వినియోగాన్ని తగ్గించే మార్గంగా సమయ-నియంత్రిత ఆహారం (Intermittent fasting) ప్రాచుర్యం పొందింది" అని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ మెటబాలిజం ఎమెరిటస్ ప్రొఫెసర్ కీత్ ఫ్రాయిన్ తెలిపారు. ‘‘ఈ విధానం శరీరంపై ప్రభావాలపై దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరం. కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (American Heart Association) అధ్యయన నివేదిక చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వదిలేస్తుంది’’ అన్నారు. షాంఘైలోని జియావో టాంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన విక్టర్ జోంగ్ నేతృత్వంలోని పరిశోధకులు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో పాల్గొన్న సుమారు 20,000 మంది వ్యక్తుల డేటాను విశ్లేషించారు. వీరిలో సగం మంది పురుషులు మరియు సగటు వయస్సు 48 సంవత్సరాలు. అలాగే, ఈ అధ్యయనం 2003 నుండి 2019 వరకు మరణాల డేటాను విశ్లేషించింది. చికాగోలో జరిగిన ఏహెచ్ఏ లైఫ్ స్టైల్ సైంటిఫిక్ సెషన్స్ సమావేశంలో ఈ సారాంశాన్ని సమర్పించారు.