3 terrorists killed: ఉగ్రవాదుల చొరబాటు యత్నం భగ్నం; ముగ్గురు టెర్రరిస్ట్ ల హతం
3 terrorists killed: ఉగ్రవాదుల చొరబాటు యత్నం భగ్నం; ముగ్గురు టెర్రరిస్ట్ ల హతం కశ్మీర్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ ద్వారా పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. జమ్మూకశ్మీర్ లోని యూరి సెక్టార్ లో ఈ ఘటన జరిగింది.
3 terrorists killed: పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు మరోసారి భగ్నం చేశాయి. జమ్మూకశ్మీర్ లోని యూరి సెక్టార్ లో నియంత్రణ రేఖ గుండా భారత భూభాగంలోకి చొరబడడానికి శనివారం తెల్లవారు జామున ముగ్గురు ఉగ్రవాదులు ప్రయత్నించారు. వారి కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారికి కాల్చి చంపేశాయి.
పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు..
ఈ విషయాన్ని భారతీయ సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో వెల్లడించింది. మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరి మృతదేహాలను రికవర్ చేశామని తెలిపింది. మూడో టెర్రరిస్ట్ మృతదేహాన్ని రికవర్ చేస్తుండగా, పాక్ వైపు నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయని, దాంతో ఆ ప్రయత్నాలను విరమించామని వెల్లడించింది. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని తెలిపింది. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఇదని వెల్లడించింది. మరణించిన ఉగ్రవాదుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించింది.
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
మరో ఆపరేషన్ లో బారాముల్లా జిల్లాలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వారిని స్థానికులైన జాయిద్ హసన్, మొహ్మద్ ఆరిఫ్ లుగా గుర్తించారు.మరోవైపు, అనంత్ నాగ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్ వరుసగా నాలుగో రోజు కూడా కొనసాగుతోంది.