Indigo Flights : ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానాలలో ముఖ్యమైన మార్పులు.. ఏప్రిల్ 15 నుంచే అమలు!-indigo shifts operations from delhi airport terminal 2 to terminal 1 and 3 from april 15th know heres why ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indigo Flights : ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానాలలో ముఖ్యమైన మార్పులు.. ఏప్రిల్ 15 నుంచే అమలు!

Indigo Flights : ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానాలలో ముఖ్యమైన మార్పులు.. ఏప్రిల్ 15 నుంచే అమలు!

Anand Sai HT Telugu

Delhi Airport : ఇండిగో ఎయిర్‌లైన్స్‌తోపాటుగా మరికొన్ని సంస్థల విమానాలు ఏప్రిల్ 15 నుంచి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 నుంచి నడవవు. నిర్వహణ పనుల కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఇండిగో విమానం

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఏప్రిల్ 15 నుండి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ(IGI) విమానాశ్రయంలోని టెర్మినల్ 1, టెర్మినల్ 3 నుండి మాత్రమే నడుస్తాయి. నిర్వహణ పనుల కారణంగా టెర్మినల్ 2 వద్ద కార్యకలాపాలను నిలిపివేస్తారు. ఏప్రిల్ 15 నుండి టెర్మినల్ 2 విమానాలు.. టెర్మినల్ 1కి మారుతాయని ఇండిగో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

టెర్మినల్ 2 నిర్వహణ పనులు

ఈ మార్పు అమలుతో ఇండిగో ఇప్పుడు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1, టెర్మినల్ 3 నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు పనిచేస్తుంది. 'ఢిల్లీ టెర్మినల్ 2 నిర్వహణలో ఉంది. ఫలితంగా ఏప్రిల్ 15, 2025 నుండి అన్ని విమానాలు టెర్మినల్ 1కి వెళ్తాయి. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇలాగే ఉంటుంది.' అని ఇండిగో నోటీసులో పేర్కొంది. విమానాల జాబితాను వెబ్‌సైట్‌లో పెడతామని కూడా పేర్కొంది.

ఇండిగో ప్రకటన

ఇండిగో ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సమాచారాన్ని ఇచ్చింది. దీనితో పాటు ఎయిర్‌లైన్ తన ప్రయాణికులందరికీ, వారి ట్రావెల్ ఏజెంట్లకు ఈ మార్పు గురించి ఎస్ఎంఎస్, కాల్స్, ఇమెయిల్‌ల ద్వారా తెలియజేస్తోంది. దీనితోపాటుగా వెబ్‌సైట్‌లో విమానాల లిస్ట్‌ను కూడా పెట్టనుంది. మీకు అవసరమైన మొత్తం సమాచారం ఇండిగో అందిస్తుంది. 'మా ప్రయాణీకులకు సరసమైన, సమయానికి, మర్యాదపూర్వకమైన, ఇబ్బంది లేని ప్రయాణ అనుభవాన్ని అందించడం మా ప్రయత్నం.' అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.

వేరే విమానాలు కూడా

ఇండిగోతో పాటుగా టెర్మినల్ 2 నుంచి నడిపించే వేరే విమానాయన సంస్థలు కూడా ఇతర టెర్మినల్‌లకు మార్చాలని భావిస్తున్నాయి. విమానాశ్రయంలో అప్‌గ్రేడ్ చేసిన టెర్మినల్ 1 ఏప్రిల్ 15 నుండి పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. 'ఢిల్లీ విమానాశ్రయంలో అప్‌గ్రేడ్ చేసిన టెర్మినల్ 1 నుంచి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుభవించండి. మంచి ప్రయాణం, మెరుగైన కనెక్టివిటీ, ప్రపంచ స్థాయి సౌకర్యాల కోసం సిద్ధంగా ఉండండి.' అని అని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

Anand Sai

eMail

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.