Mumbai airport : ఒకే రన్‌వేపై విమానాల ల్యాండింగ్- టేకాఫ్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
Indigo Air India close call : ఒకే రన్‌వేపై, ఒకే సమయంలో.. ఇండిగో విమానం ల్యాండింగ్- ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Indigo Air India close call : ముంబై విమానాశ్రయంలోని ప్రయాణికులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది! ఒకే సమయంలో, ఒకే రన్‌వేపై రెండు విమానాలు ల్యాండింగ్- టేకాఫ్ జరగడం ఇందుకు కారణం!
ఇదీ జరిగింది..
జూన్ 8న ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో.. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ జరిగింది. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధృవీకరించింది. ఈ ఘటనకు కారణమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిబ్బందిని తొలగించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతుండగానే ఇండిగో విమానం రన్ వే 27పై ల్యాండ్ అయింది. భద్రతా ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి డీజీసీఏ ఈ విషయంపై విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇండోర్‌లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం (ఐడీఆర్) నుంచి జూన్ 8న (శనివారం) ముంబై విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానం 6053.. రన్వే 27పై ల్యాండ్ అయ్యింది. అయితే.. అదే సమయంలో ఎయిర్ ఇండియా విమానం 657.. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరే ప్రక్రియలో ఉంది.
Indigo Air India Mumbai airport : ఇలా.. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ఒకే రన్‌వేపై జరగకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం! ఏది సరిగ్గా జరగకపోయినా, ఒక విమానం వెళ్లి మరొక దానిని ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది.
'విచారణ కొనసాగుతోంది..'
ప్రోటోకాల్ ఉల్లంఘనకు దారితీసిన కారణాలను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు అమలు చేయడానికి దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు చెప్పారు.
ముంబై, దిల్లీ విమానాశ్రయాలు హై ఇంటెన్సిటీ ఎయిర్ పోర్టులు, గంటకు 46 విమానాలను నడుపుతున్నాయి. విమానాలు, ప్రయాణీకుల సురక్షితమైన రాక, నిష్క్రమణను నిర్వహించడానికి ఏటీసీఓలు బాధ్యత వహిస్తాయి.
Mumbai airport latest news : "వైరల్ వీడియోలో.. విజిబిలిటీ చాలా బాగుంది. విజువల్ అబ్జర్వేషన్ ద్వారా సహేతుకమైన భరోసా ఉంటే ట్రాఫిక్ సెపరేషన్ మినీమాను తగ్గించవచ్చు. ఈ ఘటనలో బయలుదేరిన విమానం అప్పటికే బీ2 వేగానికి చేరుకుంది, రన్ వే 27పై విమానం ల్యాండ్ అవుతుండగా మరో విమానం గాలిలోకి ఎగిరిన కనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో ఉంది," అని ఏటీసీ గిల్డ్ ఇండియా ప్రధాన కార్యదర్శి అలోక్ యాదవ్ తెలిపారు.
ఇండిగో ఈ ఘటన తర్వాత ఒక ప్రకటనలో, “జూన్ 8 న ఇండోర్ నుంచి ఇండిగో విమానం 6ఈ 6053 కు ముంబై విమానాశ్రయంలో ఏటీసీ ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చింది. పైలట్ ఇన్ కమాండ్ అప్రోచ్, ల్యాండింగ్ కొనసాగించారు. ఏటీసీ సూచనలను పాటించారు. ఇండిగోలో, ప్రయాణీకుల భద్రత మాకు చాలా ముఖ్యమైనది. మేము ప్రక్రియ ప్రకారం సంఘటనను నివేదించాము,” అని తెలిపింది.
జూన్ 8న ముంబై నుంచి త్రివేండ్రం వెళ్తున్న ఏఐ657 విమానం.. సురక్షితంగా టేకాఫ్ అయిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా విమానాన్ని రన్ వేలోకి వెళ్లేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించి ఆ తర్వాత టేకాఫ్‌కు ఒప్పుకుంది. నిర్ణీత నిబంధనలకు అనుగుణంగా ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ రోల్‌ను కొనసాగించింది. విమానయాన సంస్థలకు ఇచ్చిన క్లియరెన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. జరగరానిది జరగి ఉంటే? ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
సంబంధిత కథనం