చేతితో భోజనం చేశాడని భారత సంతతికి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీని అవహేళన చేసిన ప్రత్యర్థి-indianorigin us politician zohran mamdani gets ridiculed for eating with hands ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  చేతితో భోజనం చేశాడని భారత సంతతికి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీని అవహేళన చేసిన ప్రత్యర్థి

చేతితో భోజనం చేశాడని భారత సంతతికి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీని అవహేళన చేసిన ప్రత్యర్థి

Sudarshan V HT Telugu

భారత సంతతికి చెందిన మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీని అతడి ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి బ్రాండన్ గిల్ అవహేళన చేశాడు. మమ్దానీ చేతులతో అన్నం తింటున్న వీడియోను పోస్ట్ చేసి జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. దాంతో సోషల్ మీడియా యూజర్లు గిల్ ను పెద్ద ఎత్తున విమర్శించారు.

న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ

న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన డెమోక్రాట్ జోహ్రాన్ మమ్దానీ స్పూన్, ఫోర్క్ లతో కాకుండా, వట్టి చేతులతో అన్నం తింటున్న వీడియోను రిపబ్లికన్ రాజకీయ నాయకుడు బ్రాండన్ గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోతో పాటు నాగరిక ప్రజలు అలా తినరని, పాశ్చాత్య ఆచారాలను అవలంబించాలని కోరుతూ ఒక వ్యాఖ్యను జత చేశాడు. ‘‘మీరు పాశ్చాత్య ఆచారాలను స్వీకరించడానికి నిరాకరిస్తే, మీ మూడవ ప్రపంచానికి తిరిగి వెళ్ళండి’’ అని కామెంట్ చేశాడు.

సోషల్ మీడియాలో విమర్శలు

ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పలువురు వినియోగదారులు దీనిని "జాత్యహంకార" వ్యాఖ్యగా పేర్కొన్నారు. గిల్ భారత సంతతికి చెందిన మామ దినేష్ డిసౌజా గతంలో తన చేతులతో తింటున్న ఫోటోను నెటిజన్లు తవ్వారు. సాంస్కృతిక పరంగా మమ్దానీని టార్గెట్ చేసినందుకు గిల్ పై వారు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో స్పందించిన ఓ నెటిజన్ 'టాకోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ వంటివి ఎలా తింటారు? నువ్వు కూడా ఫోర్క్ తో లేస్ తింటావా?" అని ప్రశ్నించాడు.

మీ మామను కూడా ఇండియా పంపిస్తావా?

‘బ్రాండన్ గిల్ మామ దినేష్ డిసౌజా ఇండియాలో పుట్టి పెరిగాడు, ఖచ్చితంగా తన చేతులతో తిని ఉంటాడు’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘మీ మామగారిని కూడా అమెరికా విడిచి వెళ్లమని అడుగుతావా?’ అని ప్రశ్నించాడు. 'మీరు భారతీయులపై జాత్యహంకార దాడికి పాల్పడుతుంటే, భారతీయులను పెళ్లి చేసుకోకండి' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

నేను చేతితో తినను..

కాగా, గిల్ భార్య తన భర్తకు మద్దతుగా వచ్చింది. "నేను నా చేతులతో ఎప్పుడూ అన్నం తినలేదు. ఎల్లప్పుడూ స్పూన్, ఫోర్క్ ఉపయోగించాను. నేను అమెరికాలో పుట్టాను. నేను క్రిస్టియన్ ను. నా తండ్రి బంధువులు భారతదేశంలో నివసిస్తున్నారు. వారు కూడా క్రైస్తవులు. వారు ఫోర్కులను ఉపయోగించి భోజనం చేస్తారు’ అని బ్రాండన్ గిల్ భార్య డేనియల్ డిసౌజా గిల్ పేర్కొన్నారు.

Gill's father-in-law eating with hand in past
Gill's father-in-law eating with hand in past
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.