అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పోలె చంద్రశేఖర్‌ని కాల్చి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్‌బీ నగర్‌కి చెందిన 27ఏళ్ల చంద్రశేఖర్.. టెక్సాస్ డెంటన్ ప్రాంతంలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తుండగా, అతనిపై రిచర్డ్ ఫ్లోరెజ్ అనే 28ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. రిచర్డ్ ఫ్లోరెజ్ అనే వ్యక్తి రిచ్లాండ్ హిల్స్‌కి చెందినవాడు. చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత, సుమారు ఒక మైలు దూరంలో ఉన్న మరొక వాహనంపై కూడా కాల్పులు జరిపాడు! అయితే అందులో ఎవరికీ గాయాలు కాలేదు. ఆ తర్వాత, మెడోబ్రూక్ డ్రైవ్‌లోని సమీప నివాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి, గేట్‌ను ఢీకొట్టి, అతను ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే ఫ్లోరెజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వాహనం నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
“వారు ఆ వాహనంలో తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో ఉన్నాడు. అతనిపై హత్య కేసు నమోదు చేసి, బుక్ చేశాం,” అని ఫోర్ట్ వర్త్ పోలీసు ప్రతినిధి ఆఫీసర్ బ్రాడ్ పెరెజ్ సోమవారం తెలిపారు.
పోలె చంద్రశేఖర్ మరణాన్ని టారెంట్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం ధృవీకరించింది. సంఘటనా స్థలంలోనే అతను మరణించినట్లు ప్రకటించింది.
ఫోర్ట్ వర్త్, టారెంట్ కౌంటీ అధికారులు అధికారిక ప్రకటన నమోదు చేశారు. అయితే స్థానిక ప్రభుత్వ యంత్రాంగం తాత్కాలికంగా మూసివేయడం కారణంగా తదుపరి విచారణ వివరాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ విచారణ కొనసాగుతోందని, అయితే కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
చంద్రశేఖర్ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపించడానికి, అతని కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ సంప్రదింపులు జరుపుతోంది.
చంద్రశేఖర్ హత్యపై అమెరికాలోని భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా అమెరికాలో భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
చంద్రశేఖర్ భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించడానికి, శోకసంద్రంలో ఉన్న అతని కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి 'గోఫండ్‌మీ (GoFundMe)' నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హత్యకు గురైన చంద్రశేఖర్.. హైదరాబాద్‌లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) పూర్తి చేశారు. రెండేళ్ల క్రితం ఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్) చదువు కోసం అమెరికా వెళ్లారు. అతను డెంటన్, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో డేటా అనలిటిక్స్ మాస్టర్స్ డిగ్రీ కోసం చేరారు.
ఆరు నెలల క్రితం డిగ్రీ పూర్తి చేసిన చంద్రశేఖర్, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని, తన అవసరాల కోసం గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారని అతని సోదరుడు దామోదర్ మీడియాకు తెలిపారు.
చంద్రశేఖర్ హత్య, అర్ధరాత్రి వేళల్లో పనిచేసే అంతర్జాతీయ విద్యార్థుల భద్రతా సమస్యలను మళ్లీ హైలైట్ చేసింది.
అమెరికాలో భారతీయులపై దాడులు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి! ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని కనెక్టికట్‌లో నివసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థి, 26 ఏళ్ల కొయ్యడ రవి తేజ గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించారు. ఇంచు మించు అదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో వ్యక్తి కూడా అమెరికాలో బుల్లెట్ గాయాలతో మరణించి కనిపించారు.
సెప్టెంబర్‌లో, కాలిఫోర్నియాలో మహబూబ్‌నగర్‌కు చెందిన 30 ఏళ్ల భారతీయ టెకీ మహమ్మద్ నిజాముద్దీన్‌ను పోలీసులు కాల్చి చంపారు. అతను తన రూమ్‌మేట్‌ను కత్తితో పొడిచినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, నిజాముద్దీన్ కుటుంబం మాత్రం దీనిపై జాతి వివక్ష ఆరోపణలు చేసి, సమగ్ర విచారణ కోరింది.
సెప్టెంబర్ 3న నిజాముద్దీన్ శాంటా క్లారాలోని తన నివాసంలో కత్తితో కనిపించారని, గాయాలపాలైన తన రూమ్‌మేట్‌పై అతని దాడి చేస్తూ కనిపించారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంట్లో కత్తిపోటు సంఘటన గురించి 911 కాల్ వచ్చిందని, నిజాముద్దీన్, అతని రూమ్‌మేట్ మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో ఈ దాడి జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
అయితే, తన కుమారుడు కాల్పులకు గురికావడానికి ముందే సహాయం కోసం పోలీసులకు తానే కాల్ చేశాడని నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్