Senior citizens: సీనియర్ సిటిజన్లు, మహిళలు, దివ్యాంగులకు లోయర్ బెర్త్ వసతి కల్పించడానికి భారతీయ రైల్వే చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. సీనియర్ సిటిజన్లు, 45 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళా ప్రయాణీకులు, గర్భిణీ స్త్రీలు, దివ్యాంగులకు బుకింగ్ సమయంలో నిర్దిష్ట ఎంపిక సూచించనప్పటికీ లభ్యతకు లోబడి ఆటోమేటిక్ గా లోయర్ బెర్త్ లను కేటాయించబడుతాయని తెలిపారు.
స్లీపర్ క్లాస్ లో ఒక్కో కోచ్ కు ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్ లు, ఎయిర్ కండిషన్డ్ 3 టైర్ (3ఏసీ)లో ఒక్కో కోచ్ కు నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్ లు, ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ (2ఏసీ)లో ఒక్కో కోచ్ కు మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్ లను సీనియర్ సిటిజన్లకు కేటాయించారు. గరిష్ట సౌలభ్యం కోసం రైలులో బోగీల సంఖ్యను బట్టి ఈ నిబంధన అందుబాటులో ఉందని వైష్ణవ్ తెలిపారు. రాయితీ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా రాజధాని, శతాబ్ది తరహా రైళ్లతో సహా అన్ని మెయిల్ / ఎక్స్ ప్రెస్ రైళ్లలో వికలాంగుల రిజర్వేషన్ కోటా సౌకర్యం వర్తిస్తుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, స్లీపర్ క్లాస్ లో నాలుగు బెర్తులు (రెండు లోయర్ బెర్త్లతో సహా), 3ఏసీ/3ఈలో నాలుగు బెర్తులు (రెండు లోయర్ బెర్త్లతో సహా), రిజర్వ్డ్ సెకండ్ సిట్టింగ్ (2ఎస్) లేదా ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ (సీసీ)లో నాలుగు సీట్ల కోటాను నిర్ణయించారు.
ప్రయాణంలో లోయర్ బెర్త్ లు ఖాళీగా ఉంటే తొలుత మిడిల్ లేదా అప్పర్ బెర్త్ లు కేటాయించిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ చర్యల ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉందని వైష్ణవ్ చెప్పారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సంబంధిత కథనం