Railway : దయచేసి వినండి.. రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వెయ్యికిపైగా జనరల్ క్లాస్ బోగీలు-indian railway planning to increase general class coaches it will be useful to middle class passengers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Railway : దయచేసి వినండి.. రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వెయ్యికిపైగా జనరల్ క్లాస్ బోగీలు

Railway : దయచేసి వినండి.. రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వెయ్యికిపైగా జనరల్ క్లాస్ బోగీలు

Anand Sai HT Telugu
Nov 20, 2024 09:56 AM IST

Railway Coaches: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేలాది సంఖ్యలో బోగీలు జోడించేందుకు సిద్ధమవుతోంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భారతీయ రైల్వే భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. వందలాది రైళ్లకు వెయ్యికి పైగా జనరల్ క్లాస్ బోగీలను ప్రభుత్వం జోడించబోతోందని సమాచారం. అలాగే పలు రైళ్లలో నాన్ ఏసీ బోగీల సంఖ్య కూడా పెరగనుంది. మిడిల్ క్లాస్ ప్రయాణికులు రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొత్తగా బోగీలు జోడించనుండటంతో సుమారు లక్ష మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

నవంబర్ చివరి నాటికి 370 రెగ్యులర్ రైళ్లకు 1,000కు పైగా జనరల్ సెకండ్ క్లాస్ బోగీలను జోడించనున్నట్లు రైల్వే శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో రాబోయే రెండేళ్లలో 10 వేలకు పైగా నాన్ ఏసీ జోడించనున్నారు. గత మూడు నెలల్లో పలు రైళ్లలో జనరల్ క్లాస్‌కు చెందిన 600 బోగీలను రైల్వే శాఖ చేర్చింది. కొత్త కోచ్ చేరికతో రోజుకు లక్ష మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.

సెంట్రల్ రైల్వే 42 రైళ్లలో 90 జనరల్ క్లాస్ కోచ్‌లను జోడించనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ స్వప్నిల్ నీలా తెలిపారు. దీనివల్ల రోజుకు 9 వేల మందికి పైగా అదనపు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పుడు రైల్వే శాఖ స్లీపర్ కోచ్‌ల సంఖ్యను సుమారు 4 వేల కోచ్‌లకు పెంచనుండటంతో రిజర్వేషన్‌లో సుదీర్ఘ వెయిటింగ్ లిస్ట్‌కు కూడా ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. రిజర్వేషన్లు చేయడానికి ప్రయత్నించే ప్రయాణికులు కూడా ప్రయోజనం పొందవచ్చు.

అన్ని తరగతుల ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోందని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. కొత్తగా 1,000 సెకండ్ జనరల్ క్లాస్ బోగీలను రైళ్లలో చేర్చనున్నట్లు తెలిపారు. 370 రెగ్యులర్ రైళ్లకు ఈ కొత్త బోగీలను జోడిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

జనరల్ క్లాస్ ప్రయాణికుల కోసం కోచ్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో 10 వేలకు పైగా నాన్ ఏసీ బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో 6 వేలకు పైగా జనరల్ సెకండ్ కేటగిరీ కోచ్‌లు ఉంటాయి. అయితే స్లీపర్ క్లాసులు కూడా ఉంటాయి. ఈ కొత్త బోగీల ప్రవేశంతో ప్రతిరోజూ 8 లక్షల మంది అదనపు ప్రయాణికులు జనరల్ క్లాస్‌లో ప్రయాణించవచ్చని చెబుతున్నారు.

కొత్తగా తయారు చేసిన నాన్ ఏసీ బోగీలు ఎల్‌హెచ్‌బీ తరహాలో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త కోచ్‌లు రైల్వే సాంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల కంటే తేలికైనవి, బలమైనవి. ఈ బోగీలపై ప్రమాద ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని అంటున్నారు.

Whats_app_banner