ట్రంప్ రూల్స్! అమెరికాలో దిగిన వెంటనే.. భారత దంపతులను వెనక్కి పంపించేశారు!
ఇమ్మిగ్రేషన్‌పై కఠినంగా వ్యవరిస్తామని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న సమయంలో మరో షాక్! పిల్లలని చూసేందుకు అమెరికాకు వెళ్లిన ఓ భారతీయ దంపతులను.. ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకుని, తిరిగి ఇండియాకి పంపించేశారు! అసలేం జరిగిందంటే..
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విషయంలో భారతీయ వలస సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ట్రంప్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకొస్తారో అని అందరు భయపడుతున్నారు. వీటన్నింటి మధ్య తాజాగా జరిగిన ఒక సంఘటన వార్తల్లో నిలిచింది! అమెరికాలోని తమ పిల్లలను చూసేందుకు వెళ్లిన భారతీయ దంపతులను, వారు విమానాశ్రయంలో దిగిన వెంటనే అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచే వారిని వెనక్కి పంపించేశారు. అసలేం జరిగింది?
భారతీయులను వెనక్కి పంపించేసిన అధికారులు..!
పలు మీడియా కథనాల ప్రకారం.. అమెరికాలో తమ పిల్లలను చూసేందుకు వచ్చిన భారతీయ దంపతులకు రిటర్న్ టికెట్లు లేవన్న కారణంతో నెవార్క్ విమానాశ్రయంలో అధికారులు ప్రవేశం నిరాకరించారు. ఐదు నెలల పాటు ఇక్కడే ఉండాలనే ఆలోచనతో ఈ జంట బీ-1/బీ-2 విజిటర్ వీసాలపై అమెరికాకు వెళ్లారు. అయితే 2025 నిబంధనల ప్రకారం రిటర్న్ టికెట్ తప్పనిసరి అని ఇమ్మిగ్రేషన్ అధికారులు వారికి చెప్పారు. ఆ విషయం తమకు తెలియదని సదరు భారతీయ దంపతులు స్పష్టంగా చెప్పారు. కానీ ఎంత విన్నవించినా, వివరణ ఇచ్చినా ఆ తల్లిదండ్రులను విమానాశ్రయం నుంచి నేరుగా భారత్‌కి పంపించేసినట్టు తెలుస్తోంది.
ఈ కొత్త రూల్ గురించి యూఎస్ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేనందున.. ఈ పరిణామం చాలా మంది భారతీయ ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తోంది!
ఎప్పుడు రూల్ పెట్టారో తెలియదు!
ఊహించని విధంగా ఈ నిబంధనను అమలు చేయడం ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 2025 రూల్స్ అంటూ ఎంట్రీని నిరాకరించారు. అయితే, ఈ మార్పులకు సంబంధించి ముందస్తు సమాచారం లేదా బహిరంగ సమాచారం లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి, ఆవేదనకు, ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ సంఘటన యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి స్పష్టత, పారదర్శకత అవసరాన్ని ఎత్తి చూపుతుంది. ముఖ్యంగా ఇటువంటి విధాన మార్పుల దీర్ఘకాలిక ప్రభావాల దృష్ట్యా, కచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
మరి ఇప్పుడు ఏం చేయాలి?
భారతీయ దంపతులను ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే వెనక్కి పంపించేశారన్న వార్త ప్రవాస భారతీయులు, అమెరికాకు వచ్చే సందర్శకుల్లో ప్రమాద ఘంటికలు మోగించింది. ఎయిర్పోర్ట్ ఎంట్రీల్లో ఇంకేం ఊహించని చర్యలు అమలు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను అమలు చేయడంలో అధ్యక్షుడు ట్రంప్ ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. అటువంటి పరిస్థితులను నివారించడానికి రిటర్న్ టిక్కెట్లు, ప్రయాణ ప్రణాళికల రుజువుతో పాటు అన్ని డాక్యుమెంట్లను సక్రమంగా ఉంచుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమని చెబుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్