'వధువు కావలెను..' ఇదెక్కడి ఆలోచన రా బాబు!
రోడ్డు మీద ఎన్నో బిల్‌బోర్డులు దర్శనమిస్తుంటాయి. వాహనాలు, ఆభరణాలకు సంబంధించిన యాడ్లు వాటిల్లో కనిపిస్తుంటాయి. కానీ ఎప్పుడైనా ఓ వ్యక్తి.. తన పెళ్లి కోసం యాడ్లు ఇవ్వడం మీరు చూశారా? లండన్‌కు వెళితే అవి కచ్చితంగా కనిపిస్తాయి. వధువు కావలెను అంటూ భారత సంతతి వ్యక్తి.. అక్కడి మెట్రోల్లోని బిల్‌బోర్డులపై ఈ ప్రకటనలు పెట్టాడు. అసలు ఆ కథేంటంటే..
పెళ్లి కోసం మంచి సంబంధాలను చూడాలంటే బంధులను, వారి స్నేహితులను అడుగుతుంటారు. ఇంకో అడుగు ముందుకేసి మాట్రిమోనీల్లో వివరాలు పెడుతూ ఉంటారు. అయితే యూకేలోని ఓ భారత సంతతి వ్యక్తి.. చాలా వినూత్నంగా ఆలోచించాడు. బిల్‌బోర్డులపై 'వధువు కావలెను' అని భారీ ప్రకటనలు చేశాడు.
31ఏళ్ల జీవన్ బాచు అనే వ్యక్తి లండన్‌లో నివాసముంటున్నాడు. అక్కడి అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో రెండు బిల్‌బోర్డులు అద్దెకు తీసుకుని.. తాను పెళ్లికి అమ్మాయి కోసం వెతుకుతున్నట్టు అందరికి కనిపించే విధంగా యాడ్లు ముద్రించాడు. ఆ యాడ్‌లో జీవన్ స్టిల్ ఇస్తూ కనిపించాడు. 'ఉత్తమమైన ఇండియన్ మీ సొంతమవుతాడు,' అంటూ యాడ్‌పై రాశాడు.
ఆక్స్ఫర్డ్ సర్కస్‌లోని సెంట్రల్, బేకర్లూ లైన్స్‌లో ఈ బిల్‌బోర్డులు దర్శనమిస్తున్నాయి. వేలాది మంది ఆ యాడ్లను చూస్తున్నారు.
మార్కెటింగ్‌లో పని చేసే జీవన్.. యాడ్ల కోసం భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో బిల్బోర్డుకు రూ. 2లక్షలు ఖర్చు చేశాడు.
దీనిపై జీవన్ స్పందించాడు.
"కొవిడ్ కారణంగా బయటకు వెళ్లడం కష్టమైంది. ఏదైనా వినూత్నంగా చేయాలని అనుకున్నాను. అందుకే ఇలా చేశాను. మంచి స్పందనే లభించింది. ఇప్పటివరకు 50మంది సంప్రదించారు. వాటిల్లో మంచి సంబంధాన్ని వెతుక్కోవాలి," అని స్థానిక వార్తా సంస్థకు జీవన్ వివరించాడు.
జీవన్ ఏర్పాటు చేసిన యాడ్.. బిల్‌బోర్డులపై రెండు వారాల పాటు ఉండనుంది.
వెబ్సైట్ కూడా..!
జీవన్.. యాడ్లతో ఆగిపోలేదు. www.findjeevanawife.com అని ఓ వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందులో తన వివరాలు పొందుపరిచాడు. 'ఇది జోక్ కాదు..' అంటూ ఓ వీడియో తన గురించి వివరించాడు.
ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. జీవిన్ విషయంపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ‘నీకు మంచి భార్య రావాలని కోరుకుంటున్నాము,’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సంబంధిత కథనం