US shooting : అంతా భయం భయం! అమెరికాలో కాల్పులకు భారత సంతతి వ్యక్తి, కుమార్తె బలి-indian origin man daughter shot dead in us store police arrest suspect ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Shooting : అంతా భయం భయం! అమెరికాలో కాల్పులకు భారత సంతతి వ్యక్తి, కుమార్తె బలి

US shooting : అంతా భయం భయం! అమెరికాలో కాల్పులకు భారత సంతతి వ్యక్తి, కుమార్తె బలి

Sharath Chitturi HT Telugu

US shooting : అమెరికా వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో జరిగిన కాల్పుల ఘటనలో భారత సంతతికి చెందిన ప్రదీప్ కుమార్ పటేల్ (56), ఆయన కుమార్తె మరణించారు. ఈ ఘటన భారత సంతతి ప్రజలను భయపెడుతోంది.

అమెరికాలో కాల్పులకు ఇద్దరు భారత సంతతి వ్యక్తులు బలి! (Representative image/Pexel)

అమెరికా వర్జీనియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో ఓ కన్వీనియన్స్​ స్టోర్​లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి, అతని కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వర్జీనియాలోని భారతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టించింది. తమ భద్రతపై వారందరు ఆందోళన చెందుతున్నారు.

అసలేం జరిగింది..?

వర్జీనియా అకోమాక్ కౌంటీలోని లాంక్​ఫోర్డ్ హైవేపై ఉన్న బంధువుల దుకాణంలో ప్రదీప్ కుమార్ పటేల్ (56), ఆయన కుమార్తె పనిచేస్తున్నారు. కాగా మార్చ్​ 20న ఉదయం 5.30 గంటల తర్వాత కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి కాల్పుల గురించి ఒక ఫోన్ వచ్చింది. వారు వచ్చి చూసే సరికి పటేల్ తుపాకీ గాయాలతో కిందపడిపోయాడని, స్పందించడం లేదని తెలుసుకున్నారు.

పోలీసులు భవనం కోసం గాలిస్తుండగా కాల్పులకు గురైన మరో మహిళ కనిపించింది. ఆమె, పటేల్​ కూతురు అని తర్వాత తెలిసింది.

ఈ ప్రమాదంలో పటేల్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని కుమార్తెను సెంతారా నార్ఫోక్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

పటేల్​ కూతురి వయస్సు 24ఏళ్లు.

నిందితుడి అరెస్టు..

ఈ కాల్పులకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఒనాన్​కాక్​కు చెందిన జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వైట్ (44) అనే వ్యక్తిని ఎలాంటి బాండ్ లేకుండా నిర్బంధంలో ఉంచినట్లు కౌంటీ షెరీఫ్ డబ్ల్యూ టాడ్ వెస్సెల్స్ తెలిపారు.

నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం, నేరస్థుడు తుపాకీని కలిగి ఉండటం, నేరం కింద తుపాకీని ఉపయోగించడం వంటి అభియోగాలు మోపారు.

నిందితుడు అసలు ఎందుకు కాల్పులు జరిపాడు? అతనికి పటేల్​ ముందే తెలుసా? అన్న విషయాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.

ఈ దుకాణం యజమాని పరేష్ పటేల్ వర్జీనియా స్థానిక న్యూస్ ఛానెల్ వీఏవీ-టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నా బంధువు భార్య, ఆమె తండ్రి ఈ ఉదయం పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇక్కడకు వచ్చి కాల్పులు జరిపాడు," అని వెల్లడించాడు. ఏం చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

పటేల్​, అతని కూతురు గుజరాత్​లోని మెహ్సానా జిల్లాకు చెందిన వారు. వారి మరణం.. మెహ్సానాలోని బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పటేల్​ 6,7ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లినట్టు వారు చెబుతున్నారు.

పటేల్​కి మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు అహ్మదాబాద్​, కెనడాలో నివాసముంటున్నారు.

భయాందోళనలో భారత సమాజం..

అమెరికాలో జరిగిన ఈ డబుల్​ మర్డర్​ అక్కడి భారత సంతతి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వాస్తవానికి ఈ మధ్య కాలంలో భారత సంతతి వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. కొన్ని నెలల క్రితమే.. నారత్​ కారోలీనాలోని ఓ కన్వీనియన్స్​ స్టోర్​లో పనిచేస్తుండగా 36ఏళ్ల మైనంక్​ పటేల్​ అనే భారత సంతతి వ్యక్తిని కాల్చి చంపేశారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.