జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఆయన మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హరియాణాకు చెందిన ఈ అధికారి పెళ్లి ఇటీవలే జరిగింది. ఆయన మరణం యావత్ ప్రాంతాన్ని శోకసంద్రంలో ముంచింది. వినయ్ నర్వాల్ తాత హవా సింగ్ ప్రభుత్వానికి ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రాక్షసులను కఠినంగా శిక్షించాలని, ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ప్రభుత్వాన్ని చేతులు జోడించి కోరుతున్నామన్నారు.
ఏప్రిల్ 16న లెఫ్టినెంట్ నర్వాల్ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీ నిర్వహించగా ఆయన కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. విహారయాత్ర నిమిత్తం కొచ్చి నుంచి కశ్మీర్ చేరుకున్న నర్వాల్ తన భార్యతో కలిసి పహల్గామ్ సందర్శనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులు కాల్పులు జరిపి హతమార్చారు. వినయ్ నర్వాల్ ఇరుగుపొరుగు వారు మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం పెళ్లి జరిగిందని, ఇప్పుడు మేమంతా శోకసంద్రంలో మునిగిపోయామని చెబుతున్నారు. వినయ్ ఇక మాతో లేడంటే నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినయ్ నర్వాల్ మృతదేహం పక్కన ఆయన భార్య హిమాన్షి ఉన్న ఫొటో వైరల్ అయింది.
దాడిలో మరణించిన వారి మృతదేహాలను బుధవారం శ్రీనగర్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. మృతుల్లో ఇద్దురు విదేశీయులు ఉన్నారు. మరో ఇద్దరు స్థానికులు, మిగిలినవారు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, యూపీ, బీహార్, హర్యానా తదితర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ మృతి చెందడంపై నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. 'లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతి పట్ల నౌకాదళ కుటుంబం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోంది. ఈ విపత్కర సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటాం.' అని చెప్పారు.
ఈ దాడి చాలా దురదృష్టకరమని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అన్నారు. 'అలాంటి వీరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు. దాడికి పాల్పడిన వారిని మరోసారి ఎవరూ సాహసించని విధంగా శిక్షించాలి.' అని చెప్పారు.