Facebook lover: ఫేస్ బుక్ లవర్ ను కలిసేందుకు పాక్ బోర్డర్ దాటాడు.. చివరకు..!
Facebook lover: ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన యువతితో ప్రేమలో పడి, ఆమెను కలుసుకోవడానికి పాకిస్తాన్ సరిహద్దును దాటి చిక్కుల్లో పడ్డాడు. అక్రమంగా పాకిస్తాన్ లో అడుగుపెట్టిన ఆ వ్యక్తిని అక్కడి అధికారులు అరెస్ట్ చేసి, జైళ్లో పెట్టారు.
Facebook lover: ప్రేమకు సరిహద్దులు లేవు అని నమ్మిన ఒక భారతీయుడు అక్రమంగా పాకిస్తాన్ లోకి చొరబడి, చిక్కుల్లో పడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి ఫేస్ బుక్ లో స్నేహం చేసి ప్రేమించిన మహిళను కలిసేందుకు పాకిస్థాన్ కు వెళ్లాడు. అక్రమంగా సరిహద్దులు దాటినందుకు పాకిస్తాన్ లో అతన్ని అరెస్టు చేశారు. అతని అక్రమ ప్రవేశానికి గల కారణాలపై పొరుగు దేశ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిని ఉత్తరప్రదేశ్ (uttar pradesh) లోని అలీగఢ్ జిల్లా నాగ్లా ఖత్కారీ గ్రామానికి చెందిన బాదల్ బాబుగా గుర్తించారు. అతడిని పాకిస్తాన్ లోని మండి బహవుద్దీన్ నగరంలో పాకిస్తాన్ పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఫేస్ బుక్ రోమాన్స్
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ ద్వారా పాక్ లోని ఒక మహిళతో తనకు రొమాంటిక్ రిలేషన్ షిప్ ఏర్పడిందని పాక్ పోలీసుల విచారణలో బాబు అంగీకరించినట్లు పాక్ అధికారులను ఉటంకిస్తూ ఇండియా టుడే పేర్కొంది. ఆమెను వ్యక్తిగతంగా కలవాలనే కోరికతో సరైన వీసా (visa), ప్రయాణ పత్రాలు లేకుండానే పాక్ దేశంలోకి ప్రవేశించాడు. 2024 డిసెంబర్ 27న బాబును అరెస్టు చేసి పాక్ విదేశీయుల చట్టం 1946లోని 13, 14 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించి 2025 జనవరి 10న మరోసారి హాజరుకావాలని ఆదేశించింది. కాగా, గతంలో బాబు రెండుసార్లు భారత్-పాక్ సరిహద్దు దాటేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
కుటుంబ సభ్యులకు తెలియదు
అయితే, బాదల్ బాబు పాక్ సరిహద్దును అక్రమంగా దాటాలనే ఆలోచనల గురించి తమకు తెలియదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దీపావళికి 20 రోజుల ముందు బాబు ఇంటికి వచ్చారని, నవంబర్ 30న చివరగా వీడియో కాల్ చేశాడని అతని తండ్రి కృపాల్ సింగ్ చెప్పారు. కృపాల్ సింగ్, ఇతర కుటుంబ సభ్యులు బాబును తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీనిపై, అలీగఢ్ ఎస్ఎస్పి సంజీవ్ సుమన్ మాట్లాడుతూ, దీనికి సంబంధించి పాకిస్తాన్ నుండి లేదా భారత రాయబార కార్యాలయం నుండి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారు.
ప్రేమ కోసమై..
గతంలో కూడా ఇటువంటి ఘటనలు ఇటు భారత్ లో, అటు పాకిస్తాన్ లో చోటు చేసుకున్నాయి. ప్రేమ కోసం భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ జాతీయులైన సీమా హైదర్, ఇక్రా జీవానీల తరహాలోనే ఈ కేసు కూడా ఉంది. వివరాల్లోకి వెళితే.. సీమా, ఆమె ప్రియుడు సచిన్ మీనా పబ్ జీ ఆడుతున్న సమయంలో, ఇక్రా ఆన్ లైన్ లో బోర్డ్ గేమ్ 'లూడో' ఆడుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. 2023లో ఇక్రా తన నగలను తనఖా పెట్టి స్నేహితుల వద్ద అప్పు తీసుకుని దుబాయ్, అక్కడి నుంచి ఖాట్మండుకు విమాన టికెట్లు కొనుగోలు చేసి అక్కడి నుంచి భారత్ లోకి ప్రవేశించింది.