'ఉక్రెయిన్​ నుంచి వెళ్లిపోండి..' భారతీయులకు సూచన!-indian embassy in ukraine advises indians to leave if stay not essential ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Indian Embassy In Ukraine Advises Indians To Leave If Stay Not Essential

'ఉక్రెయిన్​ నుంచి వెళ్లిపోండి..' భారతీయులకు సూచన!

HT Telugu Desk HT Telugu
Feb 20, 2022 06:01 PM IST

Indians in Ukraine | రష్యా- ఉక్రెయిన్​ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో.. ఉక్రెయిన్​లోని భారతీయులకు అక్కడి ఇండియన్​ ఎంబసీ కీలక సూచనలు ఇచ్చింది. అవసరమైతే తప్ప ఉక్రెయిన్​లో ఉండకూడదని.. ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.

రష్యా- ఉక్రెయిన్​ సరిహద్దుల్లో సైన్యం
రష్యా- ఉక్రెయిన్​ సరిహద్దుల్లో సైన్యం

Russia Ukraine conflict | ఉక్రెయిన్​లో ఉంటున్న భారతీయులకు అక్కడి ఇండియన్​ ఎంబసీ ఆదివారం కీలక సూచనలు జారీ చేసింది. అవసరమైతే తప్ప.. ఉక్రెయిన్​లో ఉండకూడదని, తాత్కాలికంగా విడిచిపెట్టి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఉక్రెయిన్​ సంక్షోభంపై రష్యా, నాటో దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో భారత ఎంబసీ ఈ విధంగా సూచనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్రెండింగ్ వార్తలు

"ఉక్రెయిన్​లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అనిశ్చితి కారణంగా, దేశంలో ఉండాల్సిన అవసరం లేని భారతీయులు, విద్యార్థులు.. ఉక్రెయిన్​ను తాత్కలికంగా విడిచిపెట్టి వెళ్లిపోవాలని సూచిస్తున్నాము. విద్యార్థులు, తమతమ కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరిపి, ఫ్లైట్ల వివరాలు తెలుసుకోవాలి. ఈ ఎంబసీ ఫేస్​బుక్​, ట్విట్టర్​, వెబ్​సైట్లను ఫాలో అవ్వాలి," అని భారతీయ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

2020 లెక్కల ప్రకారం.. ఉక్రెయిన్​లో 18వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

యుద్ధం అనివార్యమా..

రష్యా ఉక్రెయిన్​ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరగొచ్చు అనే సంకేతాలు నానాటికి బలపడుతున్నాయి. తాజాగా.. సరిహద్దు వెంబడి కాల్పుల మోత మోగింది. ఉక్రెయిన్​ సైనికులు, రష్యా మద్దతున్న వేర్పాటువాదులు.. ఆదివారం ఒకరిపై ఒకరు మోటార్​ షెల్స్​తో దాడి చేసుకున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో భీకర శబ్దాల కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమపై దాడి చేశారన్న ఆరోపణలతో.. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి దిగే అవకాశం ఉందని పాశ్చాత్య దేశాలు మండిపడుతున్నాయి. ఈ తరుణంలో సరిహద్దు వెంబడి కాల్పులు జరుగుతుండటంపై సర్వత్రా ఆందోనళ నెలకొంది.

ఉక్రెయిన్​ను రష్యా ఇప్పటికే మూడు వైపులా చుట్టుముట్టింది. 1.5లక్షల మంది సైనికులు, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్​కు సమీపంలోని బెలారస్​లో శనివారం మిలిటరీ విన్యాసాలు చేపట్టింది రష్యా. దీంతో ఉద్రిక్త వాతావరణం మరింత తీవ్రంగా మారింది. కాగా.. ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగితే.. రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధిస్తామని.. ఆమెరికా సహా అనేక దేశాలు ఇప్పటికే తేల్చిచెప్పాయి.

మరోవైపు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వోలోదిమిర్​ జెలెన్​స్కీ.. పరిస్థితులను శాంతిపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము దౌత్యపరంగానే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. సంక్షోభానికి ముగింపు పలికేందుకు.. కలిసి పనిచేద్దామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు చెప్పారు. సమావేశానికి సంబంధించిన వేదికను సైతం పుతిన్​ చెప్పాలని కోరారు. అయితే.. జెలెన్​స్కీ పిలుపును రష్యా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంపై రష్యా ఇంకా స్పందించకపోవడమే ఇందుకు కారణం.

కొన్నేళ్ల పాటు తీవ్రంగా ఉన్న రష్యా- ఉక్రెయిన్​ వివాదం.. కొన్ని నెలలుగా మరింత ముదిరింది. నాటోలో చేరాలని ఉక్రెయిన్​ చేస్తున్న ప్రయత్నాలపై రష్యా మండిపడింది. నాటోలో ఉక్రెయిన్​ చేరితే, ఆ దేశంపై ఆధిపత్యం చెలాయించడం కష్టమని భావించి.. వివాదాన్ని తీవ్రతరం చేసింది! సరిహద్దుకు లక్షలాదిమంది బలగాలను, ఆయుధాలను పంపింది.

ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బైడెన్​ సహా యూరోపియన్​ యూనియన్​ దేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. అవి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాయి.

అయితే తమకు దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా పదేపదే చెబుతూ వస్తోంది. ఈ తరుణంలోనే.. బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. కాగా.. ఇతర దేశాలు రష్యా మాటలను విభేదిస్తున్నాయి. రష్యా చెప్పినట్టు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదని చెబుతున్నాయి. ఏ క్షణంలోనైనా దాడి జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. రష్యా మాత్రం.. బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం