Indian Army dog : ‘నిజమైన హీరో’- ఉగ్రవాదుల ఏరివేతలో అర్మీ శునకం వీర మరణం-indian army dog phantom dies heroically in clash with terrorists in jk ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Army Dog : ‘నిజమైన హీరో’- ఉగ్రవాదుల ఏరివేతలో అర్మీ శునకం వీర మరణం

Indian Army dog : ‘నిజమైన హీరో’- ఉగ్రవాదుల ఏరివేతలో అర్మీ శునకం వీర మరణం

Sharath Chitturi HT Telugu
Oct 29, 2024 08:15 AM IST

Indian Army dog Phantom dies : విధుల్లో ఉండగా భారత సైన్యానికి చెందిన శునకం వీర మరణం పొందింది. ఉగ్రవాదుల కాల్పులో గాయపడిన ఫాంటమ్​ కన్నుమూసినట్టు వైట్​ నైట్​ కార్ప్స్​ వెల్లడించింది.

ఆర్మీ శునకం ఫాంటమ్​
ఆర్మీ శునకం ఫాంటమ్​ (White Knight Corps)

సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్​ సుందర్బనీ సెక్టార్లోని అసన్ సమీపంలో ఆర్మీ కాన్వాయ్​పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి చెందింది. ఆర్మీ శునకం మృతి చెందినట్లు వైట్ ​నైట్ కార్ప్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

"మా నిజమైన హీరో వీర మరణానికి మేము సెల్యూట్ చేస్తున్నాము. ఒక ధైర్యవంతుడైన #IndianArmy శునకం, #Phantom," అని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్​లో పోస్ట్ చేసింది.

ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా వారిని ఆర్మీ చుట్టుముట్టింది. అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే ఫాంటమ్​ శరీరంలోకి బుల్లెట్​లు దూసుకెళ్లాయి. తీవ్ర గాయాలతో ఫాంటమ్​ ప్రాణాలు కోల్పోయింది. ఫాంటమ్​ ధైర్యసాహసాలు, విధేయత, అంకితభావం ఎప్పటికీ మరువలేనివని వైట్​ నైట్​ కార్ప్స్​ పేర్కొంది.

2020 మే 25న జన్మించిన బెల్జియం మాలినోయిస్ శునకం ఫాంటమ్​.

యాంటీ టెర్రరిస్ట్​ ఆపరేషన్..

ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్​లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టామని, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ తెలిపింది.

జమ్ము ప్రాంతంలోని అఖ్నూర్ సెక్టార్​లో సోమవారం ఉదయం ఆర్మీ కాన్వాయ్​ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఆ తర్వాత ప్రత్యేక బలగాలు, ఎన్​ఎస్​జీ కమాండోలు ఆపరేషన్ ప్రారంభించారని అధికారులు తెలిపారు.

ఖౌర్​లోని భట్టల్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి జోగ్వాన్ గ్రామంలోని అసన్ ఆలయం సమీపంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ నిఘా, బందోబస్తును పటిష్టం చేయడానికి సైన్యం తన నాలుగు బీఎంపీ-2 పదాతిదళ యుద్ధ వాహనాలను రంగంలోకి దింపింది.

జమ్ముకశ్మీర్​లోని అఖ్నూర్​లోని బత్తల్ ప్రాంతంలోని అసన్ మందిర్ సమీపంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నామని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఆర్మీ అంబులెన్స్​పై వారు కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.

దీంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆర్మీ దళాలు వేగంగా ఎదురుకాల్పులు జరపడంతో దాడి ప్రయత్నాన్ని భగ్నం చేశామని వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది.

“#Sunderbani సెక్టార్​లోని #Asan సమీపంలో ఉదయం ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాన్వాయ్​పై కాల్పులు జరిపారు. సొంత బలగాలు వేగంగా ఎదురుకాల్పులు జరపడంతో ఎలాంటి గాయాలు కాకుండా, ఉగ్రవాదుల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాము, ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాము,” అని వైట్ నైట్ కార్ప్స్ పోస్ట్ చేసింది.

అయితే ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో సైనికులకు ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం