పెట్రోల్ పంపులో పనిచేయమని బంధువుపై ఒత్తిడి.. భార్యాభర్తలకు 11 ఏళ్లు జైలు శిక్ష.. కోటికిపైగా ఫైన్-indian american couple jailed for forcing cousin to work at petrol pump know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పెట్రోల్ పంపులో పనిచేయమని బంధువుపై ఒత్తిడి.. భార్యాభర్తలకు 11 ఏళ్లు జైలు శిక్ష.. కోటికిపైగా ఫైన్

పెట్రోల్ పంపులో పనిచేయమని బంధువుపై ఒత్తిడి.. భార్యాభర్తలకు 11 ఏళ్లు జైలు శిక్ష.. కోటికిపైగా ఫైన్

Anand Sai HT Telugu
Jun 26, 2024 11:05 AM IST

Crime News : బంధువును పెట్రోల్ పంపులో పని చేయమని భారతీయ-అమెరికన్ జంట ఒత్తిడి చేసింది. దీంతో యూఎస్ కోర్టు వారికి జైలు శిక్ష విధించడమే కాకుండా బాధితుడికి కోటి రూపాయలకు పైగా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

పెట్రోల్ పంపులో పనిచేయమని బంధువుపై ఒత్తిడి
పెట్రోల్ పంపులో పనిచేయమని బంధువుపై ఒత్తిడి

బంధువును పాఠశాలలో చేర్పిస్తాననే నెపంతో అమెరికాకు తీసుకొచ్చి మూడు సంవత్సరాల పాటు తమ గ్యాస్ స్టేషన్‌లో, కన్వీనియన్స్ స్టోర్‌లో పని చేయమని ఒత్తిడి చేసినందుకు ఒక భారతీయ-అమెరికన్ దంపతులకు US కోర్టు జైలు శిక్ష విధించింది. 31 ఏళ్ల హర్మన్‌ప్రీత్ సింగ్‌కు 135 నెలల (11.25 సంవత్సరాలు) జైలు శిక్ష, 43 ఏళ్ల కుల్బీర్ కౌర్‌కు 87 నెలల (7.25 సంవత్సరాలు) జైలు శిక్ష విధించింది. బాధితుడికి రూ. 1.87 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

'బాధితుడిని పాఠశాలలో చేర్పించేందుకు సహాయం చేస్తామని తప్పుడు వాగ్దానాలతో అమెరికాకు రప్పించేందుకు నిందితులు బాధితుడితో తమ బంధుత్వాన్ని ఉపయోగించుకున్నారు. ఇమ్మిగ్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బెదిరింపులు, శారీరకంగా ఇబ్బంది పెట్టడం, మానసిక వేధింపులకు గురిచేసి తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ గంటలు పని చేయమని ఒత్తిడి చేశారు.' అని అని న్యాయశాఖ పౌర హక్కుల విభాగానికి చెందిన అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ తెలిపారు.

బాధితుడి ఆశను ఆసరాగా చేసుకుని వాడుకున్నారని న్యాయవాది చెప్పుకొచ్చారు. అతని ప్రాథమిక హక్కులను హరించారని, స్వేచ్ఛను దోచుకున్నారని కోర్టుకు చెప్పారు. 2018లో నిందితులు బాధితుడుని ఇండియా నుంచి అమెరికాకు తీసుకొచ్చారు. పాఠశాలలో చేర్పిస్తానని తప్పుడు వాగ్దానాలు చేశారు. యూఎస్‌కి వచ్చిన తర్వాత నిందితులు బాధితుడి ఇమ్మిగ్రేషన్ పత్రాలను తీసుకున్నారు. మార్చి 2018 నుంచి మే 2021 మధ్య మూడు సంవత్సరాల పాటు నిందితులకు చెందిన స్టోర్‌లో పని చేయించుకున్నారు.

స్టోర్‌లో క్లీనింగ్ చేయడం, వంట చేయడం, స్టోర్ రికార్డ్‌లను నిర్వహించడం వంటి వాటితో రోజుకు 12 నుండి 17 గంటల మధ్య పని చేయించుకున్నారు. హర్మన్‌ప్రీత్ సింగ్‌, కుల్బీర్ కౌర్‌ జంట బాధితుడిని అనేక సందర్భాలలో రోజుల తరబడి స్టోర్‌లోని బ్యాక్ ఆఫీస్‌లో నిద్రించాలని చెప్పారు. ఆహారాన్ని సరిగా ఇచ్చేవారు కాదు. చదువు చెప్పించేందుకు ఆసక్తి చూపించలేదు. బాధితుడి ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు నిఘా పెట్టారు. భారతదేశానికి తిరిగి రావాలని అభ్యర్థించినా నిందితులు వినిపించుకోలేదు.

బాధితుడి కుటుంబ ఆస్తులను తీసుకుంటామని, వెళ్లిపోతే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇమ్మిగ్రేషన్ పత్రాల కోసం అభ్యర్థించినప్పుడు, వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పుడు బాధితుడి జుట్టును లాగి, చెంపదెబ్బ కొట్టి చిత్రహింసలు పెట్టారు. ఒకసారి వెళ్లేందుకు ప్రయత్నించగా బాధితుడిని రివాల్వర్‌తో బెదిరించారు. ఈ విషయం న్యాయస్థానం వద్దకు వెళ్లింది. దీంతో నిందితులను జైలు శిక్ష విధించి.. భారీగా జరిమానా వేసింది కోర్టు.

WhatsApp channel