HMPV virus : ‘భయపడకండి- సిద్ధంగా ఉన్నాము’.. హెచ్​ఎంపీవీ వైరస్​పై కేంద్రం క్లారిటీ-india well prepared on hmpv govt says situation in china is not unusual ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hmpv Virus : ‘భయపడకండి- సిద్ధంగా ఉన్నాము’.. హెచ్​ఎంపీవీ వైరస్​పై కేంద్రం క్లారిటీ

HMPV virus : ‘భయపడకండి- సిద్ధంగా ఉన్నాము’.. హెచ్​ఎంపీవీ వైరస్​పై కేంద్రం క్లారిటీ

Sharath Chitturi HT Telugu
Jan 06, 2025 12:10 PM IST

HMPV virus India : చైనాలో కలకలం రేపుతున్న హెచ్​ఎంపీవీ వైరస్​పై భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. సమస్య వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.

హెచ్​ఎంపీవీ వైరస్​పై కేంద్రం క్లారిటీ
హెచ్​ఎంపీవీ వైరస్​పై కేంద్రం క్లారిటీ (Representative/Getty Images)

చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) వ్యాప్తిపై భారత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్వాసకోశ వ్యాధులను నిర్వహించడానికి భారతదేశం "బాగా సిద్ధంగా ఉంది" అని, చైనాలో పరిస్థితి "అసాధారణం కాదు" అని పేర్కొంది.

yearly horoscope entry point

హెచ్​ఎంపీవీ వైరస్​పై భయం అనవసరం..!

గత కొన్ని వారాలుగా చైనాలో పెరుగుతున్న శ్వాసకోశ అనారోగ్యం నివేదికల మధ్య, భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్), ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధ్యక్షతన దిల్లీలో శనివారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), విపత్తు నిర్వహణ (డీఎం) సెల్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (ఈఎంఆర్) విభాగం, ఎయిమ్స్ దిల్లీ సహా ఇతర ఆసుపత్రులకు చెందిన పలువురు నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హెచ్ఎంపీవీ గురించి విస్తృత సమావేశం తర్వాత, మంత్రిత్వ శాఖ "ప్రస్తుత ఫ్లూ సీజన్ దృష్ట్యా చైనాలో పరిస్థితి అసాధారణమైనది కాదు. ఎప్పడూ ఉండేదే," అని అభిప్రాయపడింది. "ప్రస్తుత పరిస్థితికి కారణం ఇన్​ఫ్లుయెంజా వైరస్, ఆర్ఎస్​వీ- హెచ్ఎంపీవీ అని నివేదికలు సూచిస్తున్నాయి - ఈ సీజన్​ ఇది సాధారణ వ్యాధికారకాలు," అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే, అన్ని విధాలుగా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, చైనాలో పరిస్థితులపై క్రమం తప్పకుండా అప్డేట్లను పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ వైరస్​లు ఇప్పటికే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని గుర్తుచేసింది.

ఇన్​ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), ఇన్​ఫ్లుయెంజా ఫర్​ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ) కోసం భారత్​లో ఇప్పటికే పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉందని కేంద్రం తెలిపింది. ఐసీఎంఆర్, ఐడీఎస్​పీ నెట్​వర్క్​లు డేటా ప్రకారం ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ కేసుల సంఖ్యలో అసాధారణ పెరుగుదల కనిపించడం లేదని పేర్కొంది.

సాధారణ సీజనల్ వేరియంట్లు మినహా గత కొన్ని వారాలుగా శ్వాసకోశ వ్యాధుల కేసులు పెరగలేదని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు.

అదనంగా, అడినోవైరస్, ఆర్ఎస్​వీ, హెచ్ఎంపీవీ వంటి ఇతర శ్వాసకోశ వైరస్​ల కోసం ఐసీఎంఆర్ నెట్​వర్క్​ పరీక్షలు, ఈ వ్యాధికారకాలు కూడా పరీక్షించిన నమూనాల్లో అసాధారణమైన పెరుగుదలను చూపించలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ముందుజాగ్రత్త చర్యగా, హెచ్ఎంపీవీ కోసం పరీక్షించే ప్రయోగశాలల సంఖ్యను ఐసీఎంఆర్ పెంచుతుందని, ఐసీఎంఆర్ ఏడాది పొడవునా హెచ్ఎంపీవీ ధోరణులను పర్యవేక్షిస్తుందని తెలిపింది.

సిద్ధంగా ఉన్నాము..

ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్ వర్క్​లు అప్రమత్తంగా ఉన్నాయని, ఎలాంటి ఆరోగ్య సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్ మాదిరిగానే హెచ్ఎంపీవీ కూడా ఉందని డీజీహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ శుక్రవారం చెప్పారు. అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని, అంటే ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి వారు ఇతరులత కాంటాక్ట్​లోకి రాకుండా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.

“జలుబు, జ్వరానికి అవసరమైన సాధారణ మందులు వాడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అని గోయల్ పేర్కొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం