Election commissioner selection : ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్యానెల్- సుప్రీం
Election commissioner selection : ఎన్నికల కమిషనర్ల నియామకంలో భారీ మార్పులు జరగనున్నాయి. కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానితో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
Supreme court Election commissioner selection : ఎలక్షన్ కమిషనర్ల నియామకాల కోసం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత దేశ ప్రధాన న్యాయమూర్తి.. ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉంటారని స్పష్టం చేసింది.
‘నిస్పక్షపాతంగా జరగాలి..’
"ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలి. మా ఆదేశాలతో ఎన్నికల్లో స్వచ్ఛత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాము," అని జస్టిస్ కేఎం జోసేఫ్తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. ప్రజాస్వామ్యం, ఎన్నికల్లో స్వచ్ఛతను పరిరక్షించడం చాలా అవసరం అని, లేకపోతే తీవ్ర ప్రమాదకర పరిణామాలు ఎదురవుతాయని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
Election commissioner supreme court : ఎన్నికల కమిషనర్ బాధ్యతను అర్హుడైన వ్యక్తికి అప్పగించేందుకు సరైన వ్యవస్థ ఉండాలని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం.. ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తున్నారు. వీరి టెన్యూర్ 6ఏళ్ల వరకు ఉంటుంది. ప్రధాని సిఫార్సుల మేరకే మాజీ దౌత్యవేత్తలకు రాష్ట్రపతి ఆ బాధ్యతలు అప్పగిస్తుంటారు.
దేశంలో ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలంటే.. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఉన్న విధానాల్లో అనేక లోపాలున్నాయని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. సీబీఐ డైరక్టర్, లోక్‌పాల్ ఎంపిక చేసే అవకాశం న్యాయవ్యవస్థ, విపక్షానికి కూడా ఉందని, ఎన్నికల కమిషనర్ల విషయంలో అలా జరగడం లేదని వివరించారు.
1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్‌ను గతేడాది నవంబర్‌లో ఎన్నికల కమిషనర్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. మెరుపువేగంతో జరిగిన ఈ ప్రక్రియపై సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఈ వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి.
సంబంధిత కథనం