Govt Orders | ఎనీడెస్క్, గూగుల్ డ్రైవ్.. ప్రభుత్వ ఉద్యోగులు ఇవి వాడొద్దు!
ఎనీడెస్క్, వీపీఎన్, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ తదితర ప్రైవేటు సేవలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

థర్డ్ పార్టీ,నాన్ గవర్న్‌మెంట్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌తో సెక్యూరిటీ ఇష్యూస్ సహా వివిధ సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో భాగంగా ఈ సర్వీసులను ఉపయోగించకూడదని కేంద్రం ఆదేశించింది.
వీపీఎన్‌లతో ముప్పు
వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్) సర్వీసులను వినియోగించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఉద్యోగులను కేంద్రం కోరింది. ఈ వీపీఎన్ సర్వీసుల వినియోగానికి సంబంధించి కొన్ని ఆంక్షలు విధించింది. ఇటీవల కేంద్రం నూతన వీపీఎన్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత, భారత్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు నార్డ్‌వీపీఎన్, ఎక్స్‌ప్రెస్‌వీపీఎన్ వంటి ప్రైవేటు వీపీఎన్ సర్వీస్ సంస్థలు ప్రకటించాయి.
క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ వాడొద్దు
గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్ వంటి థర్డ్ పార్టీ, ప్రభుత్వేతర క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా ప్రభుత్వ విధుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు వాడకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆదేశాలను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) జారీ చేసింది. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎన్ఐసీ ఈ ఆదేశాలను పంపించింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
కొత్త వీపీఎన్ పాలసీ
నూతన వీపీఎన్ పాలసీని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ విధానం ప్రకారం ప్రైవేటు వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లు, డేటా సెంటర్లు తమ కేంద్రాల్లో యూజర్ డేటాను కనీసం ఐదేళ్ల పాటు స్టోర్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది వీపీఎన్ సర్వీసెస్ బిజినెస్ విధానాలకు వ్యతిరేకం. దాంతో, కొన్ని వీపీఎన్ సంస్థలు భారత్‌లో తమ సేవలను నిలిపేయాలని నిర్ణయించాయి.
ఎనీడెస్క్ కూడా...
ప్రైవేటు సంస్థల వీపీఎన్, క్లౌడ్ సర్వీసెస్‌తో పాటు మరికొన్ని సేవలను వాడడంపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో భాగంగా `టీమ్ వ్యూయర్`, `ఎనీడెస్క్`, `యామ్‌వీ అడ్మిన్` తదితర రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్‌ను కూడా వాడవద్దని స్పష్టం చేసింది. అలాగే, అధికారిక సమాచార మార్పిడి కోసం, ముఖ్యంగా కీలకమైన, రహస్య సమాచార మార్పిడి కోసం ప్రభుత్వేతర, థర్డ్ పార్టీ మెయిల్ సేవలను వాడవద్దని స్పష్టంచేసింది. అలాగే, రిమోట్, వర్చువల్ సమావేశాల థర్డ్ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు పొందవద్దని సూచించింది.
స్కానర్ యాప్స్‌తో జాగ్రత్త..
ప్రభుత్వ డాక్యుమెంట్స్ స్కానింగ్ సేవల కోసం ప్రైవేటు సంస్థల మొబైల్ బేస్‌డ్ యాప్స్‌ను వినియోగించవద్దని కేంద్రం ఉద్యోగులను ఆదేశించింది. భారత్‌లో బాగా పాపులర్ అయిన స్కానింగ్ యాప్ కామ్‌స్కానర్‌ను 2020 లోనే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. టిక్‌టాక్, పబ్జీలతో పాటు కామ్‌స్కానర్‌ను కూడా అప్పుడు కేంద్రం బ్యాన్ చేసింది. ప్రభుత్వ అకౌంట్ల పాస్‌వర్డ్ నిర్వహణలో కూడా జాగ్రత్తగా ఉండాలని, క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా, ప్రతీ 45 రోజులకు పాస్‌వర్డ్ మార్చుకోవాలని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ.. రెగ్యులర్, తాత్కాలిక, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.