Mpox Case In India : భారత్‌లో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు.. ఐసోలేషన్‌లో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి
Mpox Case In India : మంకీపాక్స్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే ఈ వైరస్ భారత్‌లోకి కూడా వచ్చిందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి ఐసోలేషన్‌లో ఉన్నాడు.
మంకీపాక్స్ గురించి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఎక్కువగా ఉన్న దేశం నుంచి ఓ వ్యక్తి ఇండియాకు వచ్చినట్టుగా గుర్తించారు. ఈ మేరకు మంకీపాక్స్ సంక్రమణతో వేరే దేశం నుండి తిరిగి వచ్చిన వ్యక్తిని వైరస్ అనుమానిత కేసుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి అతడిని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. రోగి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రోగికి మంకీపాక్స్ సోకిందో లేదో నిర్ధారించడానికి శాంపిల్స్ తీసుకున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. 'Mopox ఉందా లేదా అనేది తెలియడానికి రోగి నుండి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాం. ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఈ కేసును నిర్వహిస్తున్నాం.' అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) నిర్వహించిన అంచనాలకు అనుగుణంగా ఉందని పేర్కొంటూ.. పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మంకీపాక్స్ ఇండియాలో అనుకునేంత ఆందోళనకరంగా ఏం లేదని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా భారతదేశం ఉందని తెలిపింది. వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంట్రాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంకీపాక్స్ వైరస్ 12 ఆఫ్రికన్ దేశాలలో వ్యాప్తి చెందడాన్ని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. తర్వాత మూడు వారాలకు అనుమానిత Mpox కేసు భారతదేశంలో కనుగొన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో దీనికి సంబంధించిన టీకాలు వేస్తున్నారు. ఈ వైరస్ మశూచిని పోలిన లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే మంకీపాక్స్ ఇన్ఫెక్షన్‌కు పూర్తిగా నయం చేసే మందులు లేవు. రోగనిరోధక గ్లోబలిన్, యాంటీ వైరల్ మందులు మంకీ పాక్స్ చికిత్సలో వాడుతారు. మంకీపాక్స్ లక్షణాలు ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. జ్వరం, శరీరంపై దద్దుర్లు, వాపు, తలనొప్పి, అలసట ఉంటాయి.
మంకీపాక్స్ ఆఫ్రికా దేశాల్లో ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే 18వేల అనుమానిత కేసులు, 926 మరణాలు నమోదు అయ్యాయి. కొత్తరకం కేసులు 258 వరకూ నమోదైనట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.