India Post GDS Recruitment: ‘పది అర్హత’తో పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాలు: పూర్తి వివరాలు ఇవే
India Post GDS Recruitment 2023: 12,828 పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు పదో తరగతి అర్హతగా ఉంది. పూర్తి వివరాలు ఇవే.
India Post GDS Recruitment 2023: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్ (India Post).. గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్‍ను విడుదల చేసింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు indiapostgdsonline.gov.in వెబ్‍సైట్‍లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు ఆఖరు గడువు జూన్ 11గా ఉంది. ఈ పోస్టులకు పదో తరగతి అర్హతగా ఉంది. మ్యాథమాటిక్స్, ఇంగ్లిష్‍తో పాటు స్థానిక భాష సబ్జెక్టులను పదో తరగతిలో చదివి ఉండాలి. పూర్తి వివరాలు ఇవే.
ముఖ్యమైన తేదీలు
India Post GDS Recruitment 2023: ఈ పోస్టులకు దరఖాస్తులు నేడు (మే 22) ప్రారంభమయ్యాయి. అన్‍లైన్‍లో అప్లికేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ జూన్ 11గా ఉంది.
దరఖాస్తులు మొదలు: మే 22
దరఖాస్తులకు తుది గడువు: జూన్ 11
దరఖాస్తుల్లో తప్పుల సవరణ: జూన్ 12 నుంచి జూన్ 14 వరకు..
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఈ నోటిఫికేషన్‍లో.. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‍లో 118 పోస్టులు, తెలంగాణ సర్కిల్‍లో 96 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో 12,828 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత
India Post GDS Recruitment 2023: 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, పదో తరగతిలో గణితం( మ్యాథమాటిక్స్), ఇంగ్లిష్‍తో పాటు స్థానిక భాష సబ్జెక్టులుగా ఉండి ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వారు పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్ సహా స్థానిక భాష అయిన తెలుగు సబ్జెక్టులను చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. indiapostgdsonline.gov.in వెబ్‍సైట్‍లో ఉన్న నోటిఫికేషన్ ను అభ్యర్థులు పరిశీలించాలి.
వయోపరిమితి
India Post GDS Recruitment 2023: ఈ పోస్టాఫీస్ పోస్టులకు దరఖాస్తు చేసే వారి వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్‍సీ, ఎస్‍టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎస్‍సీ/ఎస్‍టీ దివ్యాంగులకు 15 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ ఇలా..
India Post GDS Recruitment 2023: పదో తరగతిలో సాధించిన మార్కులు/గ్రేడ్స్/పాయింట్స్ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఇండియా పోస్ట్ ఎంపిక చేస్తుంది. ఈ పోస్టుల కోసం ఎలాంటి పరీక్ష ఉండదు. పదో తరగతి మార్కులు/గ్రేడ్‍ల ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది.
పరీక్ష ఫీజు
India Post GDS Recruitment 2023: ఈ పోస్టాఫీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు రూ.100గా ఉంది. మహిళలు, ఎస్‍సీ, ఎస్‍టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ఇలా..
- ముందుగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‍సైట్‍లోకి వెళ్లాలి.
- ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే.. హోం పేజీలో ఉండే రిజిస్ట్రేషన్ బటన్‍పై క్లిక్ చేసి వివరాలు సమర్పించాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
- అనంతరం అప్లై ఆన్‍లైన్‍పై క్లిక్ చేసి.. అడిగిన వివరాలు నమోదు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‍లోడ్ చేయాలి.
- అప్లికేషన్‍లో వివరాలు ఫిల్ చేయడం పూర్తయ్యాక.. సబ్మిట్ బటన్‍పై క్లిక్ చేయాలి. చివరగా ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ పూర్తయ్యాక దాన్ని ప్రింటౌట్ తీసుకోవాలి.