Mike Pompeo: ‘అప్పుడు భారత్ - పాక్ యుద్ధానికి చాలా దగ్గరిగా వచ్చాయి.. కానీ’-india pakistan nuke war was too close former us secretary of state mike pompeo on his book ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Pakistan Nuke War Was Too Close Former Us Secretary Of State Mike Pompeo On His Book

Mike Pompeo: ‘అప్పుడు భారత్ - పాక్ యుద్ధానికి చాలా దగ్గరిగా వచ్చాయి.. కానీ’

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 25, 2023 08:35 AM IST

Mike Pompeo on India - Pakistan War Situation: 2019లో భారత్ - పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు. తన పుస్తకంలో ఆ వివరాలను వెల్లడించారు. యుద్ధం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నది చెప్పారు. ఆ వివరాలివే..

Mike Pompeo: ‘అప్పుడు భారత్ - పాక్ యుద్ధానికి చాలా దగ్గరిగా వచ్చాయి.. కానీ’
Mike Pompeo: ‘అప్పుడు భారత్ - పాక్ యుద్ధానికి చాలా దగ్గరిగా వచ్చాయి.. కానీ’

Mike Pompeo on India - Pakistan War Situation: 2019 బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ (Balakot Surgical Strikes) తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితి ఏర్పడిందని అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో (Mike Pompeo) అన్నారు. 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్ ఉగ్రవాదులు పుల్వామాలో భారత జవాన్ల వ్యాన్‍పై ఆత్మాహుతి దాడికి (Pulwama Terror Attack) తెగబడ్డారు. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు మృతి చెందారు. దీనికి బదులుగా భారత సైన్యం పాక్ భూభాగంలోని బాలకోట్‍లో ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఉగ్రమూకలను మట్టుబెట్టింది. అయితే, అది జరిగిన తర్వాత భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల గురించి పాంపియో.. తన పుస్తకంలో రాసుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

అణు యుద్ధానికి దగ్గరగా..

India - Pakistan War Situation: 2019లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధంగా ఏర్పడే పరిస్థితి నెలకొందని మైక్ పాంపియో.. తన పుస్తకం ‘నెవల్ గివ్ అన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ (Never Give an Inch: Fighting For the America I Love)లో పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరిలో వియత్నాంలో హనోయ్‍లో యూఎస్-నార్త్ కొరియా శాంతి చర్చల నాటి విషయాలను వెల్లడించారు. పాకిస్థాన్ అణు యుద్ధానికి సిద్ధమవుతోందని, బదులు చెప్పేందుకు తాము కూడా సన్నద్ధమవుతున్నామని అప్పటి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తనతో చెప్పారని పాంపియో పేర్కొన్నారు.

“భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు 2019 ఫిబ్రవరిలో అణు యుద్ధానికి ఎంత దగ్గరగా వెళ్లాయనే విషయం ప్రపంచానికి తెలియదని నేను అనుకుంటున్నా. హనోయ్‍లో.. ఓ రోజు సుష్మా స్వరాజ్ మాటలతో నిద్ర లేచాను. దాడి చేసేందుకు పాకిస్థాన్ అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటోందని భావిస్తున్నామని ఆమె చెప్పారు. భారత్‍ కూడా సిద్ధమవుతోందని నాకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఏ చర్యలు తీసుకోవద్దని, నాకు కాస్త సమయం ఇవ్వాలని అడిగా” అని తన పుస్తకంలో పాంపియో రాశారు. ఈ పుస్తకంలో సుష్మా స్వరాజ్‍ను He అని ఆయన తప్పుగా పేర్కొన్నారు.

రెండు దేశాలను ఒప్పించాం

India - Pakistan War Situation: “హోటల్ నుంచే అంబాసిడార్ బోల్టన్‍తో మాట్లాడాను. ఆ తర్వాత పాకిస్థాన్ లీడర్, ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వాతో చర్చించాను. భారతీయులు ఇలా తనతో చెప్పారని ఆయన(బాజ్వా)కు తెలియజేశా. అయితే అది నిజం కాదని ఆయన అన్నారు” అని పాంపియో రాశారు. “అయితే, భారతీయులే తమపై దాడికి అణ్వాయుధాలను మోహరిస్తున్నారని తాము అనుకుంటున్నామని ఆయన చెప్పారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తగ్గించడానికి కొన్ని గంటలు పట్టింది. అణు యుద్ధానికి దిగవద్దని రెండు పక్షాలను ఒప్పించాం” అని మైక్ పాంపియో తన పుస్తకంలో వెల్లడించారు.

మొత్తంగా అయితే భారత్, పాకిస్థాన్ మధ్య మరో యుద్ధం రాకుండా తాను, తమ బృందం కృషి చేసిందని మైక్ పాంపియో తన పుస్తకంలో రాసుకొచ్చారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం