ప్రపంచం నలుమూలల నుంచి శరణార్థులు వచ్చి స్థిరపడే ధర్మశాల భారత్ కాదని సుప్రీం కోర్టు కామెంట్స్ చేసింది. శ్రీలంక తమిళుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మన జనాభా 140 కోట్లకు పైగా ఉందని జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ సందర్భంగా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం నలుమూలల నుంచి శరణార్థులను భారత్ ఆహ్వానించగలదా? ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారికి స్వాగతం పలికే ధర్మశాల కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.
నిషేధిత ఎల్టీటీఈతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పిటిషనర్‌ను 2015లో అరెస్టు చేశారు. 2018లో ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై ఆయన హైకోర్టులో అప్పీల్ చేయగా శిక్షను ఏడేళ్లకు కుదించారు. శిక్ష పూర్తయిన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు దేశం విడిచి వెళ్లాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా నిరాకరించింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ కె.వినోద్ చంద్రన్ కూడా ఉన్నారు. ఏడేళ్ల శిక్ష పూర్తయిన వెంటనే తనను బహిష్కరిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శ్రీలంక జాతియుడు అప్పీల్ దాఖలు చేశారు. అయితే శిక్షాకాలం పూర్తయిన తర్వాత భారత్‌లోనే ఉండాలనే కోరికను వ్యక్తం చేశారు. తన క్లయింట్ వీసాపై భారత్‌కు వచ్చాడని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తిరిగి స్వదేశానికి వెళ్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు.
దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా స్పందిస్తూ.. 'ఇక్కడ స్థిరపడే హక్కు మీకు ఏముంది?' అని ప్రశ్నించగా పిటిషనర్ తరఫు న్యాయవాది అతడు శరణార్థి అని, తన పిల్లలు, భార్య ఇప్పటికే భారత్‌లో స్థిరపడ్డారని చెప్పారు. బయటి వ్యక్తులెవరికీ ఇక్కడికి వచ్చి స్థిరపడే హక్కు లేదని ధర్మసనం స్పష్టం చేసింది. అన్ని దేశాల నుంచి వచ్చిన వారిని ఆదరించేందుకు భారత్ ధర్మశాల కాదని పేర్కొంది.
దీనిపై పిటిషన్ తరఫున న్యాయవాది స్పందిస్తూ.. తన క్లయింట్ స్వదేశానికి తిరిగి వెళ్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. దీనిపై జస్టిస్ దత్తా స్పందిస్తూ వేరే ఏ దేశానికైనా వెళ్లండని చెప్పారు.
టాపిక్