ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలతో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మంగళవారం మధ్యాహ్నం నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకినట్లు పేర్కొంది. అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి నైరుతి రుతుపవనాలు చేరినట్లు ఐఎండీ వెల్లడించింది.
అండమాన్ పరిసరాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రానున్న మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం వరకు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని ఐఎండీ వెల్లడించింది. మే 27 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
భారతదేశానికి నైరుతి రుతుపవనాల చాలా కీలకం. నైరుతి రుతుపవనాలతో దేశంతో అధికంగా వర్షాలు కురుస్తాయి. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతుంటాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే మే 27 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2009లో మే 23నే రుతుపవనాలు కేరళను తాకాయి. ఆ తర్వాత అంత త్వరగా ఏడాదే అంచనా వేస్తున్నారు. అనుకున్న సమయానికి రుతుపవనాలు కేరళను తాకితే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది.
ఈనెల 27న నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ రుతుపవనాల విస్తరణ ప్రకారం చూస్తే జూన్ మొదటివారంలోనే అంటే దాదాపు ఐదో తేదీలోపే రాష్ట్ర సరిహద్దులను తాకుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళను తాకుతుంటాయి. ఆ తర్వాత వారం, పది రోజుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు విస్తరిస్తాయి. రుతుపవనాలు కేరళను తాకినప్పటి నుంచి ఏపీలో వాతావరణం చల్లబడుతుంది.
జూన్ మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ ఏడాది మే 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలు ఉండడంతో జూన్ రెండో వారం నుంచే ఏపీలో వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నెల 27న నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు ఐఎండీ అంచనా వేస్తుంది. ఈ రుతుపవనాల విస్తరణ ప్రకారం చూస్తే జూన్ మొదటివారంలోనే అంటే దాదాపు ఐదో తేదీలోపే తెలంగాణ సరిహద్దులను తాకుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
రానున్న వర్షాకాలంలో సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు గతేడాది 962.6 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. ఈ ఏడాది తెలంగాణలో సాధారణ సగటు కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది.
సంబంధిత కథనం