India belongs to Muslims too: బలవంతపు మత మార్పిడులకు తాము కూడా వ్యతిరేకమేనని మదానీ స్పష్టం చేశారు. అయతే, ఇప్పుడు స్వచ్ఛంధంగా మత మార్పిడి చేసుకున్నా, తప్పుడు కేసులు పెట్టి జైళ్లో పెడుతున్నారని ఆరోపించారు.
ఇస్లాం భారత్ లో అత్యంత పురాతన మతమని జమాయిత్ ఉలేమా ఇ హింద్ (Jamiat Ulama-i-Hind) అధ్యక్షుడు మౌలానా మొహమూద్ మదానీ (Maulana Mahmood Madani) వ్యాఖ్యానించారు. ఈ దేశంపై తమకూ సమాన హక్కులున్నాయన్నారు. ‘‘భారత్ మా దేశం. ఈ దేశం నరేంద్ర మోదీ (PM Modi)కి, మోహన్ భాగవత్ కు ఎంత చెందుతుందో మహమూద్ మదానీకి అంతే చెందుతుంది. ఒకరికి ఎక్కువ చెందడం, మరొకరికి తక్కువ చెందడం అనేది లేదు. అందరికీ ఇది సొంత దేశమే’’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో జరిగిన జమాయిత్ ఉలేమా ఇ హింద్ (Jamiat Ulama-i-Hind) ప్లీనరీ ని ఉద్దేశించి మదానీ ప్రసంగించారు. ‘‘ఇస్లాం ఈ దేశంలో అత్యంత పురాతన మతం. ఇది ముస్లింల తొలి స్వస్థలం. ఇస్లాం వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిందనడం పూర్తిగా తప్పు. నిరాధారం. ముస్లింలకు భారత్ అత్యంత ఉత్తమమైన దేశం’’ అని వ్యాఖ్యానించారు.
భారత్ లో మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని మదానీ గుర్తు చేశారు. అయితే, బలవంతంగా మతమార్పిడి చేయడానికి తాము వ్యతిరేకమన్నారు. ‘బలవంతం చేసో, ప్రలోభపెట్టో, మోసం చేసో మత మార్పిడికి పాల్పడడం తప్పు. మేం దానికి వ్యతిరేకం’ అన్నారు. అయితే, ముస్లింలు లక్షంగా దాడులు జరుగుతున్నాయని, నమాజ్ ను నిషేధించడం, బుల్ డోజర్లను ప్రయోగించడం వంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. జమాయిత్ ఉలేమా ఇ హింద్ (Jamiat Ulama-i-Hind) ప్లీనరీ ఢిల్లీలో మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా ఇస్లామోఫోబియాను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
టాపిక్