Hafiz Saeed: ‘‘ముంబై దాడుల కుట్రదారు హఫీజ్ సయీద్ ను మాకు అప్పగించండి’’- పాక్ ను కోరిన భారత్
Hafiz Saeed: ముంబైలో జరిగిన 26/11 దాడులు సహా భారత్ లో జరిగిన పల ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ను తమకు అప్పగించాలని భారత్ పాకిస్తాన్ ను కోరింది.
Hafiz Saeed: పాకిస్తాన్ కోర్టు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలిన హఫీజ్ సయీద్ కు పదిహేనున్నర ఏళ్ల నుంచి 31 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. 2008లో ముంబైపై దాడి సహా పలు ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ను తమకు అప్పగించాలని భారత్ పాకిస్థాన్ ను కోరినట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అంతర్జాతీయ ఉగ్రవాది
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారన్న ఆరోపణలతో పాక్ అధికారులు 2019లో అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ (Hafiz Saeed) ను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ కోర్టు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో ఆయనను దోషిగా తేల్చి, జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో, ఆయనను తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తోందని జియో న్యూస్ చానెల్ వెల్లడించింది. 2020 నుంచి పాక్ కోర్టు హఫీజ్ సయీద్ ను కనీసం ఐదు ఉగ్రవాద నిధుల కేసుల్లో దోషిగా తేల్చి, జైలు శిక్ష విధించింది. కానీ, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం మాత్రం రహస్యంగా ఉంది.
గతంలో కూడా..
హఫీజ్ సయీద్ ను తమకు అప్పగించాలని గతంలో కూడా భారత్ పలుమార్లు పాకిస్థాన్ ను కోరింది. 2008 లో జరిగిన ముంబై దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబై దాడుల్లో సయీద్ పాత్రపై పాక్ అధికారులు అధికారికంగా అభియోగాలు మోపలేదు. 2012లో సయీద్ పై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా (జేయూడీ)లను ఉగ్రసంస్థలుగా నిర్ధారించి అమెరికా, ఐక్యరాజ్యసమితి నిషేధం విధించాయి.