Supreme Court comments on Independence of Election Commission: భారత ఎన్నికల సంఘం స్వతంత్రతను వరుస ప్రభుత్వాలు పూర్తిగా నాశనం చేశాయని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 1996 నుంచి ఏ ఒక్క ప్రధాన ఎన్నికల అధికారి(chief election commissioner - CEC))కి పూర్తి కాలం పని చేసే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేసింది.
ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం లేకపోవడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ప్రమాదకర ధోరణి ప్రబలే ముప్పు ఉందని హెచ్చరించింది. సీఈసీ(CEC), ఇతర కమిషనర్ల ఎంపిక విషయంలో రాజ్యాంగంలో ఎలాంటి స్పష్టత లేకపోవడాన్ని అధికారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అవకాశంగా తీసుకున్నాయని వ్యాఖ్యానించింది.
1996 తరువాత ఈ CECకి కూడా పూర్తిగా ఆరేళ్ల పాటు విధులు నిర్వర్తించే అవకాశం లభించలేదని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఏ ఒక్క అధికారి కూడా పూర్తి కాలం పని చేయకుండా అన్ని ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకున్నాయని విమర్శించింది. ‘గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వమైనా, ప్రస్తుతమున్న ప్రభుత్వమైనా ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యాయి. ఇది చాలా ఆందోళనకర అంశం’ అని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఏ ఒక్క సీఈసీ(CEC)ని పూర్తి కాలం విధులు నిర్వర్తించే అవకాశం ఇవ్వకపోవడం వల్ల నామమాత్రంగా చెప్పుకునే ఎన్నికల సంఘం స్వతంత్రత(Independence of Election Commission) కూడా పూర్తిగా నాశనమైపోయిందని వ్యాఖ్యానించింది. దాంతో, ప్రభుత్వాలను ప్రశ్నించే పరిస్థితే లేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎవరో ఒకరిని ఎంపిక చేయండి. వారిని తగ్గించిన పదవీ కాలంతో CEC గా నియమించండి. మీకు విధేయుడిగా ఉండేలా చూసుకోండి. ఇలాగే ఉంది పరిస్థితి’’ అని ధర్మాసనం ఘాటుగా స్పందించింది.
గతంలో న్యాయమూర్తుల నియామకాల విషయంలో ప్రభుత్వం చేసిన విమర్శలకు బదులుగానే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని భావిస్తున్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో ప్రత్యేక చట్టం కానీ, నిబంధనలు కానీ లేకపోవడాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఇటీవల ప్రశ్నించారు. తమకు తెలిసిన వారిని, తమ ముందు న్యాయవాదులుగా అప్పీయర్ అయిన వారిని కొలీజియం జడ్జీలుగా నియమిస్తుందని కిరణ్ రిజుజు వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పారదర్శకంగా లేదని విమర్శించారు. కేంద్ర మంత్రి చేసిన విమర్శలకు కౌంటర్ గానే సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసిందని భావిస్తున్నారు.