mafia -politician Mukhtar Ansari: తూర్పు యూపీపై దశాబ్దాల ఆధిపత్యం; ఎవరీ మాఫియా డాన్ అన్సారీ?
గత కొన్ని దశబ్దాలుగా తూర్పు యూపీలో ముఖ్తార్ అన్సారీది ఎదురు లేని ఆధిపత్యం. తన ఏలుబడిలోని ప్రాంతాల్లో ప్రత్యర్థులకు అడుగుపెట్టనివ్వని పవర్. జైళ్లో ఉండి కూడా, గత 18 ఏళ్లుగా ఆయన ఆ ప్రాంతాన్ని శాసించారు. తూర్పు యూపీలోని ముస్లిం సమాజంపై ముఖ్తార్ అన్సారీ ప్రభావం తిరుగులేనిది.
Mukhtar Ansari: గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ముఖ్తార్ అన్సారీ దశాబ్దాలుగా తూర్పు ఉత్తరప్రదేశ్ లోని మౌ, ఘాజీపూర్ జిల్లాల రాజకీయాలను శాసించారు. మౌ అసెంబ్లీ స్థానానికి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఆయన సోదరుడు అఫ్జల్ అన్సారీ ఘాజీపూర్ నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత 18 ఏళ్లుగా ఆయన జైలులో ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలోని ముస్లిం సమాజంపై ముఖ్తార్ అన్సారీ ప్రభావం కారణంగా అనేక పార్టీలు ఎన్నికల్లో మద్దతు కోరుతూ ఆయనను ఆశ్రయిస్తుంటాయి.
రాజకీయ నాయకుడిగా..
మౌ సదర్ అసెంబ్లీ స్థానం 1996 నుండి 2022 వరకు ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) కుటుంబానికి పెట్టని కోటగా నిలిచింది. ముఖ్తార్ అన్సారీ ఈ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు (1996, 2002, 2007, 2012, 2017) గెలిచారు. మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన కుమారుడు అబ్బాస్ అన్సారీ 2022లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు.
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం
ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందినవారు. ఆయన తాత డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ అన్సారీ 1926-27లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1947లో నౌషెరా సెక్టార్ లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించినందుకు ఆయన తల్లి తరఫు తాత బ్రిగేడియర్ ఉస్మాన్ ను మరణానంతరం మహావీర్ చక్రతో సత్కరించారు. ఆయన తండ్రి సుభాన్ ఉల్లా అన్సారీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆయన సమీప బంధువు హమీద్ అన్సారీ భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నారు.
కాలేజీలో చదువుతూ, గ్యాంగ్ లీడర్ గా
ముఖ్తార్ అన్సారీ ఘాజీపూర్ పీజీ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి విద్యార్థి సంఘం రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ క్రమంలో ముఖ్తార్ కు ఓ గ్యాంగ్ లీడర్ తో పరిచయం ఏర్పడి ఆ గ్యాంగ్ లో సభ్యుడిగా మారాడు. ఆ తరువాత క్రమంగా ఆ ప్రాంతంలో పట్టు సాధించాడు. తూర్పు యూపీలో ముక్తార్ ఆధిపత్యం కారణంగా, ఇతర గ్యాంగ్ స్టర్ లైన బ్రజేష్ సింగ్, హరి శంకర్ తివారీ, ధనుంజయ్ సింగ్ లు అజంఘర్, మౌ మరియు ఘాజీపూర్ రాజకీయాలలో జోక్యం చేసుకునే ధైర్యం చేయలేదు.
సోదరుడు ఎంపీ
ఆయన సోదరుడు అఫ్జల్ అన్సారీ ఘాజీపూర్ జిల్లాలోని మొహమ్మదాబాద్ అసెంబ్లీ స్థానానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2004, 2019లో ఘాజీపూర్ నుంచి లోక్ సభకు ఎన్నికైన అఫ్జల్ రెండోసారి బీజేపీ అభ్యర్థి మనోజ్ సిన్హాపై విజయం సాధించారు. మూడో సోదరుడు సిబ్గతుల్లా అన్సారీ కూడా 2007, 2012లో రెండుసార్లు మొహమ్మదాబాద్ నుంచి గెలిచారు. సిబ్గతుల్లా కుమారుడు సుహైబ్ అన్సారీ 2022లో మహమ్మదాబాద్ నుంచి ఎస్పీ తరఫున గెలిచారు.
ఈ ప్రాంతాల్లో తిరుగులేని నేత
ఘాజీపూర్, మౌ, ఆజంగఢ్, వారణాసి, మీర్జాపూర్, జౌన్పూర్ జిల్లాల్లో ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) కి తిరుగులేని ఆధిపత్యం ఉంది. ముఖ్యంగా అక్కడి ముస్లిం సమాజం ఆయన గీసిన గీత దాటరని చెబుతుంటారు. ముఖ్తార్ అన్సారీ 1995లో బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో ఘోసి నుంచి బీఎస్పీ తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కల్పనాథ్ రాయ్ పై పోటీ చేసి, ఓడిపోయారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల తరువాత ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మద్దతుతో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా అన్సారీ డీజీపీ కార్యాలయానికి వెళ్లడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. మిత్రపక్షం బీజేపీ ఒత్తిడితో బీఎస్పీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
సొంత పార్టీ పెట్టి..
ముఖ్తార్ అన్సారీ 2002, 2007 అసెంబ్లీ ఎన్నికల్లో మౌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత క్వామీ ఏక్తా దళ్ పేరుతో సొంత పార్టీ పెట్టారు. 2012 లో ఆ పార్టీ అభ్యర్థిగా గెలుపు సాధించారు. 2016 లో క్వామీ ఏక్తా దళ్ ను సమాజ్ వాదీ పార్టీలో విలీనం చేశారు. 2009 లోక్ సభ ఎన్నికలకు ముందు ముఖ్తార్ తన సోదరుడు అఫ్జల్ తో కలిసి బీఎస్పీలో చేరారు. వారణాసి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషిపై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. కానీ 2010 ఏప్రిల్ 10న మాయావతి ముక్తార్, ఆయన సోదరుడు అఫ్జల్ ను బీఎస్పీ నుంచి బహిష్కరించారు.