Heavy Rains : భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో రూ. 1140 కోట్లకు పైగా నష్టం
Heavy Rains : నైరుతి రుతుపవనాలు మే 30న కేరళ తీరాన్ని తాకాయి. జూన్ 27న హిమాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. అప్పటి నుంచి హిమాచల్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 31 మంది చనిపోయారు. 33 మంది గల్లంతయ్యారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. కోట్ల ఆస్తి నష్టం జరిగింది.
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు భారీ నష్టం వాటిల్లిందని, బుధవారం వరకు మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. వానాకాలం మెుదలైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 31 మంది మరణించారు. 33 మంది గల్లంతయ్యారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటివరకు రూ.1,140 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, అత్యధికంగా రోడ్డు మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు రూ.502 కోట్లు, జలశక్తి శాఖకు రూ.469 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.139 కోట్లు నష్టం వాటిల్లింది.
ఈ వారంలో హిమాచల్ ప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆగస్టు 21 తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్ బరస్ట్ వంటి సుమారు 25 రకాల విపత్తులు, ప్రమాదాలకు గురైంది. గత వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్ లో కనీసం 65 క్లౌడ్ బరస్ట్ సంఘటనలు జరిగాయి.
ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్ట్ అనేది తీవ్రమైన వాతావరణ సంఘటన. సరళంగా చెప్పాలంటే ఇది ఒక చిన్న ప్రాంతంలో స్వల్ప వ్యవధిలో సంభవించే తీవ్రమైన వర్షపాతాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా క్లౌడ్ బరస్ట్ ఘటనలు పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ వంటి కొండ ప్రాంతం కలిగిన రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్‌కు పలు కారణాలు ఉన్నాయి.
నదీ తీరం కోత, నదీతీరంలో పూడిక కారణంగా అధిక నీటి ప్రవాహాలను నియంత్రించడానికి తగినంత సామర్థ్యం లేకపోవడం వల్ల ఆకస్మిక వరదలు సంభవిస్తాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రవాహాలకు ఆటంకం ఏర్పడుతుంది. నదీ ప్రవాహంలో మార్పులు సంభవిస్తాయి. మేఘ విస్ఫోటనం సమయంలో కొన్ని నిమిషాల్లో 20 మి.మీ కంటే ఎక్కువ వర్షం పడవచ్చు.
రానున్న మూడు, నాలుగు రోజుల పాటు హిమచల్ ప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణం కంటే 3 శాతం అధికంగా 632.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.