IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక-imd predicts thunderstorm from may 4 issues red alert for severe heatwave ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

HT Telugu Desk HT Telugu
May 01, 2024 05:20 PM IST

IMD predictions: మే 4 వ తేదీ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని హెచ్చరించింది. రాష్ట్రాల వారీగా వడగాల్పుల హెచ్చరికలను జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

IMD predictions: మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు కొనసాగుతాయని, ఇప్పట్లో వడగాల్పులు తగ్గుముఖం పట్టవని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా తూర్పు భారతదేశంలో అసాధారణంగా తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ కు మూడు రోజులు, ఒడిశాకు రెండు రోజులు, మొత్తంగా ఈస్ట్ ఇండియాకు రాబోయే 3-5 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది.

మే 5 తరువాత తెలంగాణలో వర్షాలు..

‘‘మే 5 వ తేదీ తరువాత ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుతాయని మేము అంచనా వేస్తున్నాము…’’ అని ఐఎండీ (IMD) శాస్త్రవేత్త సోమా సేన్ అన్నారు. మే 4 నుండి రెండు, మూడు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

ఐఎండీ వర్షపాతం అంచనా

అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వచ్చే 5 రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని, ఈదురుగాలులు (గంటకు 30-50 కి.మీ) వీస్తాయని ఐఎండీ తెలిపింది. మే 1-2 మధ్య అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మే 1-3 తేదీల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మే 1, 2 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్ లో, మే 2న దక్షిణ అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్ముకశ్మీర్, లడఖ్, గిల్గిట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు లేదా హిమపాతం సంభవించే అవకాశం ఉంది. మే 3-6 తేదీల్లో బాల్టిస్థాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 4 - మే 6 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ లలో వర్షాలు కురుస్తాయి. మే 1-3 తేదీల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీలలో బలమైన ఉపరితల గాలులు (గంటకు 25-35 కిలోమీటర్లు) వీస్తాయి. మే 5 - 8 మధ్య ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, మాహే లలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఐఎండీ వడగాల్పుల అంచనా

తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని గంగా తీర ప్రాంతం, తూర్పు జార్ఖండ్, ఉత్తర ఒడిశా, రాయలసీమలో మే 03 వరకు 44-47 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ గంగా తీర ప్రాంతంలో మే 1న, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, మే 1-2 తేదీల్లో సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 2 తర్వాత వేడి గాల్పుల తీవ్రత తగ్గుతుందని వెల్లడించింది. రానున్న 3 రోజుల్లో రాయలసీమలో తీవ్రమైన వడగాల్పులు, ఆ తర్వాత 2 రోజుల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక, కోస్తాంధ్ర, యానాంలో వచ్చే 4-5 రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 1, 2 తేదీల్లో కేరళలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 1-3 తేదీల్లో తమిళనాడులో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 1-5 మధ్య కొంకణ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్, మరాఠ్వాడాలో వడగాల్పుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

ఐఎండీ గరిష్ట ఉష్ణోగ్రత అంచనాలు

  • రాబోయే 24 గంటల్లో వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పు లేదు. ఆ తర్వాత 4-6 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుంది.
  • వచ్చే 48 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండదని, ఆ తర్వాత 2-3 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుందని తెలిపింది.
  • వచ్చే 3 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.
  • వచ్చే 48 గంటల్లో పశ్చిమ భారతంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు ఉండవని, ఆ తర్వాత 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందన్నారు.

IPL_Entry_Point