Cold wave : నార్త్ ఇండియా వెళ్లే వారికి బ్యాడ్ న్యూస్! ఇంకొన్ని రోజుల పాటు 'కోల్డ్ వేవ్' పరిస్థితులు..
Cold wave in North India : ఉత్తర భారతాన్ని కోల్డ్ వేవ్ గడగడలాడిస్తోంది. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. హాలీడే సీజన్లో ఈ పరిస్థితులు ఇబ్బందిగా మారాయి.
ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను శీతల గాలులు (కోల్డ్ వేవ్) పట్టి పీడిస్తున్నాయి! ఎగువ ప్రాంతాలను హిమపాతం కప్పివేసింది. హిమాలయ ప్రాంతంలోని అనేక చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా కంటే దిగువకు పడిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం హాలీడే సీజన్ ఉండటంతో ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి తీవ్రంగా ఉన్న సమయంలో చలి వణికిస్తోంది.
కోల్డ్ వేవ్‌పై ఐఎండీ అలర్ట్..
మరో వారం రోజుల పాటు చలిగాలులు కొనసాగుతాయని, జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు అక్కడక్కడా మంచు, వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
జమ్ముకశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాలు కఠినమైన శీతాకాలం నుంచి ఉపశమనం పొందినప్పటికీ.. గుల్మార్గ్, పహల్గాం వంటి చోట్ల ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే అనేక డిగ్రీలు పడిపోయాయని వాతావరణ అధికారులు సోమవారం తెలిపారు.
స్కీయింగ్ హబ్‌గా పేరొందిన ఉత్తర కశ్మీర్‌లోని పర్యాటక రిసార్ట్ పట్టణం గుల్మార్గ్లో సోమవారం రాత్రి ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నమోదైందని, అంతకుముందు రాత్రితో పోలిస్తే ఇది రెండు డిగ్రీలు తక్కువ అని వాతావరణ శాఖ తెలిపింది.
వార్షిక అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్‌గా పనిచేస్తున్న దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్లో సోమవారం రాత్రి -8.5 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
శ్రీనగర్ లో రాత్రి ఉష్ణోగ్రత మైనస్ 0.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని, ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే ఒక డిగ్రీ ఎక్కువని తెలిపింది. కశ్మీర్‌కు ముఖద్వార పట్టణమైన ఖాజీగుండ్‌లో -2.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, పరంపూర్లోని కొనిబాల్ లో -1.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల పరిస్థితి ఇలా..
హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు వరుసగా మూడో రోజు సాధారణం కంటే దిగువకు పడిపోయాయి! ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం నమోదైంది. కల్పా, కుఫ్రిలో అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది. నరకాండ, కీలాంగ్ తదితర ప్రాంతాల్లో ఆదివారం మంచు కురిసింది.
హిమాచల్‌ప్రదేశ్ లోని మైదాన ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు చలిగాలులు కొనసాగుతాయని సిమ్లా ఐఎండీ సీనియర్ అధికారి సందీప్ కుమార్ శర్మ తెలిపారు. జనవరి 1వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, జనవరి 2 నుంచి 5వ తేదీ వరకు ఎగువ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందన్నారు.
ఉత్తరాఖండ@లో గత 24 గంటల్లో కొండ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండగా, ముక్తేశ్వర్ (నైనిటాల్)లో 2.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. డెహ్రాడూన్, జాలీగ్రాంట్, పంత్నగర్, ఖతిమా, హరిద్వార్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు పరిస్థితులు నెలకొన్నాయి.
ఐఎండీ డెహ్రాడూన్ సెంటర్ డైరెక్టర్ బిక్రమ్ సింగ్ మాట్లాడుతూ రాబోయే వారం రోజుల పాటు (డిసెంబర్ 30 నుంచి జనవరి 5 మధ్య) రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని, హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉందని తెలిపారు.
క్రిస్మస్, న్యూ ఇయర్ హాలీడే నేపథ్యంలో హిమాచల్ వంటి రాష్ట్రాలకు ఇప్పటికే సందర్శకుల తాకిడి తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాలు మంచుతో కూరుకుపోయాయి. ఆయా చోట్ల ట్రాఫిక్ జామ్‌లు అధికంగా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల పాటు పరిస్థితులు ఇలాగే ఉంటాయని అధికారులు చెబుతుండటం ఆందోళనకర విషయం.
దిల్లీలో ఇలా..
భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో రాజస్థాన్, హరియాణా, పంజాబ్‌లలో కూడా చలిగాలులు వీచాయి.
రాబోయే కొద్ది రోజుల్లో దిల్లీతో సహా వాయువ్య, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని ఐఎండీ అంచనా వేసింది.
పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉందని ఐఎండీ అధికారి డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. రాబోయే రెండు రోజుల పాటు పంజాబ్, హరియాణాలో దట్టమైన పొగమంచు ఉంటుందని, ఇది దృశ్యమానతను ప్రభావితం చేస్తుందని, ప్రయాణ అంతరాయాలకు దారితీస్తుందని ఐఎండి అంచనా వేసింది.
సంబంధిత కథనం