ఈశాన్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో ఆగస్టు, సెప్టెంబరులో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. సెప్టెంబర్‌లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అన్నారు. వర్షాకాలం మొదటి అర్ధభాగంలో (జూన్ మరియు జూలై) భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి.
ఇక రాబోయే రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాలు, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలోని నైరుతి ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి జూలై 31 వరకు సాధారణ వర్షపాతం 445.8 మిల్లీమీటర్లకు గాను 474.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఆరు శాతం అధికమని ఐఎండీ డైరెక్టర్ చెప్పారు.
ఈ కాలంలో దేశంలో 624 భారీ వర్షపాతం, 76 అధిక వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ చీఫ్ వెల్లడించారు. ఈశాన్య భారతంలో వరుసగా ఐదో ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. గత 30 ఏళ్లుగా ఈ రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది.
నైరుతి రుతుపవనాల సీజన్ సగం అయిపోయినా ఆంధ్రప్రదేశ్‌లో అనుకున్నంత వర్షాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆగస్టు, సెప్టెంబరులో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాసం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నిజానికి బ్రేక్ మాన్‌సూన్ దేశం అంతటా ఉంది. ఈ పరిస్థితి ఏపీలోనూ కొనసాగుతోంది. దీంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు నెలలో ఉత్తర కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా.