IMD Red Alert : ఐఎండీ రెడ్ అలర్ట్.. గుజరాత్‌లో భారీ వర్షాలు, వడోదరలో వరదలు.. 28 మంది మృతి
Gujarat Floods : గుజరాత్‌లోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వరద పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర నగరం అత్యంత ప్రభావితమైన పట్టణంగా ఉంది. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. గుజరాత్‌కు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల్లో వరద ముంచెత్తింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడదోరలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాలు 10 నుండి 12 అడుగుల నీటిలో మునిగిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్లు సైతం కొనసాగుతున్నాయి.
ఐఎండీ రెడ్ అలర్ట్
ప్రస్తుతం భుజ్‌కు ఉత్తర-వాయువ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న సౌరాష్ట్ర, కచ్ఛ్‌లలోని లోతైన అల్పపీడనం ఈశాన్య అరేబియా సముద్రం వైపు కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. గుజరాత్‌లోని వడోదర, ఛోటాడేపూర్, నర్మదా, భరూచ్, సూరత్‌తో సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
28 మంది మృతి
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుండి వరదలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దాదాపు 28 మంది మృతి చెందారు. రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు కురుస్తున్న వర్షాలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
మరో నాలుగు రోజులు
లోతైన అల్పపీడనం గంటకు 12 కి.మీ వేగంతో కదులుతున్నదని, సౌరాష్ట్ర, కచ్ఛ్ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త రమాశ్రయ్ యాదవ్ చెప్పారు. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
అధికారిక ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలోని 140 రిజర్వాయర్లు, డ్యామ్‌లు, 24 నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఆగస్టు 30 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వడోదరలో అల్లకల్లోలం
రెండు రోజులుగా వడోదరలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 12 అడుగుల మేర నీరు ఉంది. ఈ జిల్లా గుండా ప్రవహించే విశ్వామిత్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా అజ్వా డ్యాం నుండి నీటిని విడుదల చేయడంతో 37 అడుగులకు పెరిగింది. వరదల కారణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీని రప్పించారు.
దభోయ్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్లే మార్గంలో రాజాలి క్రాసింగ్ సమీపంలో కొత్తగా నిర్మించిన రోడ్డు కొట్టుకుపోయింది. రోడ్ల నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ప్రజలు ఆరోపించారు. దేవ్, ధాధర్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి.
వడోదరలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ అన్నారు. 5,000 మంది నివాసితులను ఖాళీ చేయించారు. 1,200 మంది ఒంటరిగా ఉన్న వ్యక్తులను రక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలు సేవలందిస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
ఇప్పటికే సిద్ధార్థ్ నగర్, అకోటా, ఫతేగంజ్ వంటి ప్రాంతాలు నీట మునిగాయి. వరదలను తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలను పరిశీలిస్తోంది. అజ్వా డ్యామ్ నుంచి వచ్చే నీటిని విశ్వామిత్ర నదిలోకి ప్రవహించకుండా నర్మదా కాలువకు మళ్లించాలని ప్రతిపాదించారు. ఈ ప్రణాళికను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో చర్చించినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.