IMD warning: ఈ రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరిక
IMD warning: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటకల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో 'అతి భారీ వర్షాలు' కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల పాటు మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో 'అతి భారీ' వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కర్నాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల (MONSOON) రాకతో గత 2-3 రోజులుగా మహారాష్ట్ర, కోస్తా కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ మహారాష్ట్ర, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, దక్షిణ మధ్య మహారాష్ట్ర, కొంకణ్, కోస్తా కర్నాటక ప్రాంతాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమా సేన్ రాయ్ తెలిపారు. ఉత్తర ఇంటీరియర్ కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత ఈ వర్షాలు కొంత తగ్గుముఖం పట్టవచ్చని వెల్లడించారు.
ముంబైలో భారీ వర్షం
సోమవారం సాయంత్రం ముంబైలో భారీ వర్షం కురిసింది. మంగళవారం ఉదయం ముంబై నగరంలో 50 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ మంగళవారం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది.
జూన్ 14 వరకు..
జూన్ 10 నుంచి 14 వరకు పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 10, 13, 14 తేదీల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర... జూన్ 11 నుంచి 14 వరకు అస్సాం, మేఘాలయ, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కిం, జూన్ 13, 14 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్ గఢ్ లలో వచ్చే ఐదు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలావుండగా, జూన్ 11న దక్షిణ మధ్యప్రదేశ్లో వడగళ్ల వానలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ (IMD) తెలిపింది.