IMD : ఆంధ్ర, తెలంగాణల్లో హీట్‌వేవ్.. గుజరాత్లో భారీ వర్షాలు!
IMD heatwave alert : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తుపాను కారణంగా గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
Cyclone Biparjoy live updates : బిపర్జాయ్ తుపాను.. ఈ నెల 15న గుజరాత్ మాండ్వి, జఖౌ పోర్ట్- పాకిస్థాన్ కరాచీ మధ్యలో తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. గుజరాత్ సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
"తీవ్రరూపం దాల్చిన బిపర్జాయ్ తుపాను.. మంగళవారం తెల్లవారుజామున పోర్బందర్కు 290కి.మీల నైరుతివైపు, జఖౌ పోర్టుకు దక్షిణ- నైరుతి దిశకు 360కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 15న సాయంత్రానికి తీరం దాటుతుంది," అని ఐఎండీ వెల్లడించింది. కచ్, ద్వారకా, పోర్బందర్, జమ్నగర్, రాజ్‌కోట్, జునాగఢ్, మార్బీ జిల్లాల్లో 14న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. 15న మరిన్ని ప్రాంతాల్లో అతి బారీ వర్షాలు పడతాయని వివరించింది. ముఖ్యంగా సౌరాష్ట్రలోని ఉత్తర భాగంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 16న.. ఉత్తర గుజరాత్, దక్షిణ రాజస్థాన్లలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెప్పింది.
మరోవైపు తూర్పు, దక్షిణ భారతంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఐఎండీ ప్రకారం.. మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ నుచి అతి భారీ వర్షాలు పడతాయి. రానున్న 2 రోజుల్లో కేరళలో హెవీ రెయిన్‌ఫాల్ ఉంటుంది.
ఆంధ్ర.. తెలంగాణలో హీట్‌వేవ్..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. నేడు ఆంధ్రలో, మంగళ, బుధవారాల్లో తెలంగాణల్లో ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలకు చేరుతుందని హెచ్చరించింది.
Temperature in Hyderabad : "జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, అదిలాబాద్, నిర్మల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. హైదరాబాద్‌లో 38-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. రెండు రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి," అని ఐఎండీ స్పష్టం చేసింది.
"ఆంధ్రప్రదేశ్‌లో నేడు హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయి. అయితే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తెలికపాటి వర్షాలు పడొచ్చు. రుతుపవనాలు తీర, రాయలసీమ ప్రాంతాలను 2-3 రోజుల్లో తాకుతాయి. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి," అని ఐఎండీ వెల్లడించింది.
సంబంధిత కథనం