భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని బుధవారం ప్రకటించింది. రాబోయే 12 గంటల్లో ఉత్తర కర్ణాటక-గోవా తీరాలకు దూరంగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది ఉత్తరం వైపు కదిలి, తదుపరి 36 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
మే 21, 2025 ఉదయం 8:30 గంటలకు, ఉత్తర కర్ణాటక-గోవా తీరాలకు దూరంగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాబోయే 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడి, అది ఉత్తరం వైపు కదిలి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది.
దీని వల్ల దక్షిణ, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం అస్థిరంగా మారుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు దిగువ ట్రోపోస్పియర్‌లోకి విస్తరించి ఉన్న ద్రోణి దీనికి ప్రధాన కారణం.
వాతావరణ నిపుణులు ఈ వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ, సముద్ర పరిస్థితులను బట్టి ఈ అల్పపీడనం తుఫాన్‌గా మారే అవకాశం ఉంది.
వాయువ్య భారతదేశంలో, పంజాబ్, దాని పరిసర ప్రాంతాల్లో దిగువ స్థాయిలలో మరో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ వ్యవస్థ నుండి తూర్పు బంగ్లాదేశ్ వరకు తూర్పు-పడమర ద్రోణి విస్తరించి ఉంది. అస్సాం మధ్య భాగంలో కూడా మరో ఆవర్తనం ఏర్పడింది. దీనివల్ల భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
భారీ గాలులు, అలలతో కూడిన సముద్ర పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో చేపల వేటను నిలిపివేయాలని ఐఎండీ మత్స్యకారులను కోరింది. మే 21 నుండి 26 వరకు తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ, కర్ణాటక, కొంకణ్ మరియు గోవా, దక్షిణ గుజరాత్ తీరాలు, లక్షద్వీప్ ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
అంతేకాకుండా, నైరుతి అరేబియా సముద్రం, సోమాలియా తీరానికి దూరంగా ఉండాలని మత్స్యకారులకు సూచించారు. మే 21 నుండి 26 వరకు ఆంధ్రప్రదేశ్ తీరం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మే 26న అండమాన్ సముద్రంలో కూడా చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ స్పష్టం చేసింది.
టాపిక్