దేశంలో రానున్న రోజుల్లో కనిపించే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 15 నుంచి గుజరాత్‌తో పాటు వాయువ్య భారతంలో హీట్‌వేవ్ పరిస్థితులు కనిపిస్తాయని వెల్లడించింది. మరోవైపు, తూర్పు భారతంతో పాటు తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో 4,5 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.
దిల్లీ-ఎన్సీఆర్ సహా వాయువ్య భారతదేశంలో ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 18 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఏప్రిల్ 14న దిల్లీలో ప్రధానంగా రోజంతా స్పష్టమైన ఆకాశం కనిపిస్తుందని, గరిష్ట ఉష్ణోగ్రత 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 15న, ఇదే విధమైన స్పష్టమైన వాతావరణం కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయి. గరిష్టంగా 39 నుంచి 41 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది అని ఐఎండీ తన బులెటిన్‌లో తెలిపింది.
ఏప్రిల్ 16న దిల్లీలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
ఐఎండీ నివేదిక ప్రకారం.. వాయువ్య భారతదేశంలో ఏప్రిల్ 13 నుంచి 18 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 3-5 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 14 నుంచి 19 మధ్య మధ్య భారతదేశంలో 2-4 డిగ్రీల సెల్సియస్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండకపోవచ్చని ఐఎండీ తెలిపింది.
ఏప్రిల్ 14, 15 తేదీల్లో పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఏప్రిల్ 16-18 తేదీల్లో పలు ప్రాంతాల్లో, ఏప్రిల్ 19న కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.
ఏప్రిల్ 14 తేదీల్లో తెలంగాణ, ఏప్రిల్ 15-19 మధ్య పశ్చిమ మధ్యప్రదేశ్; ఏప్రిల్ 15 నుంచి 17 వరకు గుజరాత్‌లలో హీట్‌వేవ్ పరిస్థితులు కనిపించవచ్చు. ఏప్రిల్ 16-18 మధ్య పంజాబ్, హరియాణా, ఏప్రిల్ 16-19 మధ్య తూర్పు రాజస్థాన్‌లో వడగాల్పులు వీస్తాయి.
రానున్న ఐదు రోజుల్లో ఈశాన్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భారతంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఏప్రిల్ 14 నుంచి 16 వరకు అసోం, మేఘాలయ, ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 15న పశ్చిమ బెంగాల్, ఒడిశా, కోస్తాంధ్ర, యానాం, మధ్యప్రదేశ్, ఏప్రిల్ 14, 15 తేదీల్లో ఝార్ఖండ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, మాహేలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం