Weather Update : ఇక్కడ రానున్న రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. మంచు దుప్పటిలో సిమ్లా, మనాలి!
Weather News : ఉత్తర భారతంలో చలి వీపరితంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. మరోవైపు హిమచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలిలో మంచు దుప్పటి కప్పుకుంది.
ఉత్తర భారత రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే పర్వత ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సౌరాష్ట్ర కచ్‌లోని కొన్ని ప్రదేశాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.
ఐఎండీ రాబోయే రెండు రోజుల్లో వాయువ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 2 డిగ్రీల వరకు తగ్గుతాయని, ఆ తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు 2-4 నుంచి నాలుగు డిగ్రీల వరకు క్రమంగా పెరుగుతాయని అంచనా వేసింది. 27న పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడాలో, డిసెంబర్ 27,28 తేదీల్లో మధ్యప్రదేశ్, విదర్భలో కూడా వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ ప్రకారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని అంచనా వేసింది. జమ్మూ-కశ్మీర్, లడఖ్, గిల్గిత్- బాల్టిస్తాన్, ముజఫరాబాద్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోనూ ఇదే కొనసాగనుంది.
ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి ఉత్తర ప్రాంతాలలో చలిగాలులు, పొగమంచు పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజులు తీవ్రమైన చలిగాలులకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలి వంటి పర్యాటక కేంద్రాలు మంచు దుప్పటి కప్పినట్టుగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు హిమపాతంతో కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి వెళ్లాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలి, ఇతర పర్యాటక కేంద్రాలలో వైట్ క్రిస్మస్ జరుపుకుంటున్నట్టుగా మారింది. హిమపాతం కారణంగా 200 రోడ్లు మూసివేశారు. హోటల్ బుకింగ్‌లు పెరిగాయి. వాహనాలు జారడం ఘటనల్లో నాలుగు మరణాలు సంభవించాయి.
అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకుపోయిన వందలాది వాహనాల్లోని పర్యాటకులను సోమవారం అర్ధరాత్రి వరకు సురక్షితంగా రక్షించినట్లు అదనపు ముఖ్య కార్యదర్శి (రెవెన్యూ అండ్ విపత్తు) ఓంకార్ శర్మ తెలిపారు. పర్యాటకులు జిల్లా యంత్రాంగం, పోలీసులు జారీ చేసే సూచనలను పాటించాలని తెలిపారు.