IITian Baba : మహా కుంభమేళాలో ఐఐటీయన్ బాబా.. ఇదే గొప్ప మార్గం అంటూ సైన్స్ వదిలి ఆధ్యాత్మికత వైపు
IITian Baba at Mahakumbh : కొందరు గొప్ప గొప్ప చదువులు చదువుతారు. ఆ తర్వాత ఆధ్యాత్మికత వైపు మళ్లిపోతారు. ఇలా వెళ్లినవారు చాలా మందే ఉన్నారు. తాజాగా ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో కూడా ఓ ఐఐటీయన్ బాబా కనిపించారు.
ఉన్నత చదువులు చదివినవారు కూడా ఆనందం కోసం అన్వేషిస్తారు.. అయితే ఒక్కోక్కరికి ఒక్కో విధంగా ఆనందం దొరుకుతుంది. కొందరి ఆనందం కోసం అన్వేషణ ఆధ్మాత్మికత వైపు నడిపిస్తుంది. అన్నీ త్యజించి.. కేవలం భక్తితో మాత్రమే బతికేస్తారు. అందులోనే తెలియని లోకానికి వెళ్లిపోతారు. ఎప్పుడూ దైవ ధ్యాసలోనే ఉంటారు. మన దేశం సంస్కృతి నచ్చి ఇతర దేశాల నుంచి వచ్చి కూడా ఇలాంటి దారిలో నడిచినవారూ ఉన్నారు. ఈ విషయాలు చెప్పుకోవడం ఎందుకంటే.. ఆధ్యాత్మికత కోసం సైన్స్‌ని విడిచిపెట్టాడు ఐఐటీయన్ బాబా అభయ్ సింగ్. ఆయనను పలకరిస్తే చెప్పిన విషయాలు వినేందుకు చిన్నవిగా అనిపించినా.. అందులో చాలా అర్థం దాగి ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుక మహా కుంభమేళా. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతోంది. మహాకుంభమేళాలో అనేక రకాల జనాలు కనిపిస్తారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు కోట్లాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారు.
మహా కుంభమేళాలో ఉన్న నాగ సాధువులు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ మతపరమైన వేడుకలో నాగ సాధువులు, అఘోరీలు.. ఇలా.. కొంతమందిని కలుసుకోవచ్చు. అయితే మహాకుంభంలో ఐఐటీయన్ బాబా ఉండటం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
ఆధ్యాత్మికత కోసం సైన్స్‌ని విడిచిపెట్టిన IITian బాబా చాలా విషయాలు చెప్పాడు. మాట్లాడే సమయంలో ఐఐటీయన్ బాబా తీరుపై ఓ ఛానల్ ఇంటర్వ్యూయర్ అడిగాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. 'మీరు బాగా మాట్లాడతారు, మీరు బాగా చదువుకున్నారు" అని ఇంటర్వ్యూయర్ అన్నాడు. దీనికి బాబా బదులిస్తూ తాను ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివానని చెప్పారు బాబా.
ఈ విషయం చెప్పడంతో ఇంటర్వ్యూయర్ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు. తర్వాత తెరుకుని ఏంటి ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారా? అని అడిగాడు . 'అవును నా పేరు అభయ్ సింగ్' అని వెల్లడించాడు. మీరు ఈ దశకు ఎలా చేరుకున్నారని అడగ్గా.. ఈ దశ ఉత్తమ వేదిక అని అని సమాధానమిచ్చాడు. జ్ఞానాన్ని కొనసాగిస్తే.. మీరు ఇక్కడకే చేరుకుంటారని బదులిచ్చారు. దీంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆశ్చర్యపోయాడు.
ఐఐటీయన్ బాబా మాత్రమే కాదు.. గొప్ప గొప్ప చదువులు చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా జీవితంపై వైరాగ్యమో, సత్యాన్వేషణ కోసం ఇలా ఆధ్యాత్మికత వైపు వెళ్తుంటారు. జీవితంలో అన్ని వదిలివేసి కేవలం భక్తితో మాత్రమే ముందుకు వెళ్తారు. జీవితంలో చివరకు మిగిలేది ఏం లేదని చెప్పకనే చెబుతుంటారు.
సంబంధిత కథనం