Chikungunya : చికున్గున్యాకి చెక్- ఔషధాన్ని కనుగొన్న భారత పరిశోధకులు.. కానీ!
చికున్‌గున్యా చికిత్సలో ఉపయోగపడే విధంగా ఉన్న ఒక ఔషధాన్ని ఐఐటీ రూర్కీ పరిశోధకులు కనుగొన్నారు. అయితే, దీనిపై మరిన్ని అధ్యయనాలు, క్లినికల్ పరిశోధనలు జరగాలని అంటున్నారు.
జ్వరం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి, దద్దుర్లు కలిగించి.. దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి చికున్‌గున్యా చికిత్సకు ఉపయోగపడే విధంగా ఉన్న ఒక ఔషధాన్ని ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఐఐటీ రూర్కీ ప్రకారం.. హెచ్ఐవీ చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగించే ఎఫావిరెంజ్ అనే మందు చికున్‌గున్యా వ్యాధికి సైతం సమర్థవంతమైన చికిత్సగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది విట్రోతో పాటు ఎలుకల నమూనాల్లో చికున్‌గున్యా వైరస్ రెప్లికేషన్ని తగ్గిస్తుందని తేలింది.
చికున్‌గున్యాకు ఔషధం..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మద్దతుతో ఐఐటీ రూర్కీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ల్యాబ్‌లో వృద్ధిచెందిన సెల్ కల్చర్స్తో పాటు వ్యాధికు గురైన ఎలుకల్లో వైరస్ స్థాయిలను ఈ ఎఫావిరెంజ్ తగ్గించగలిగిందని అధ్యయనం ద్వారా తేలింది.
నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం చికున్‌గున్యా భారతదేశంలో పునరావృతమయ్యే ప్రజారోగ్య సమస్య! ప్రతి సంవత్సరం అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. అంతేకాక, చికున్‌గున్యా కోసం ప్రత్యేకంగా ఆమోదించిన యాంటీవైరల్ చికిత్స లేదు.
చికున్‌గున్యాకు సంబంధించిన సింద్బిస్ వైరస్ పునరుత్పత్తిని ఎఫావిరెంజ్ ప్రభావితం చేసిందని అధ్యయనంలో తేలింది.
వైరస్ పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభంలోనే ఎఫావిరెంజ్ జోక్యం చేసుకోగలదని పరిశోధనలు సూచిస్తున్నట్టు అధ్యయనం మొదటి రచయిత డాక్టర్ సంకేత్ నెహుల్ చెప్పారు.
"ఈ మందు ఇప్పటికే హెచ్ఐవీ చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నందున, తదుపరి క్లినికల్ ట్రయల్స్ చికున్‌గున్యా చికిత్సకు దాని సామర్థ్యాన్ని అన్వేషించగలవు. కొత్త యాంటీవైరల్ మందులను అభివృద్ధి చేయడానికి అవసరమైన సమయం, ఖర్చును ఇవి తగ్గిస్తాయి," అని డాక్టర్ నెహుల్ తెలిపారు.
ఈ పరిశోధనల ప్రాముఖ్యతను వివరించిన అధ్యయన రచయిత ప్రొఫెసర్ షైలీ తోమర్.. ప్రస్తుతం నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేనందున చికున్‌గున్యా సోకిన వ్యక్తులు కేవలం లక్షణాల నిర్వహణపైనే ఆధారపడుతున్నారని చెప్పారు.
“చికున్‌గున్యా చికిత్సకు ఎఫావిరెంజ్ సంభావ్య యాంటీవైరల్ ఔషధం కావచ్చని మా అధ్యయనం ప్రాథమిక శాస్త్రీయ ఆధారాలను అందిస్తుంది. అయితే చికున్‌గున్యా రోగుల్లో దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి క్లినికల్ ట్రయల్స్ అవసరమవుతాయు,” అని ప్రొఫెసర్ తోమర్ తెలిపారు.
‘ఇంకా పరిశోధనలు జరగాలి..’
ఐఐటీ రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ కమల్ కిశోర్ పంత్ మాట్లాడుతూ ప్రజారోగ్య సవాళ్లను పరిష్కరించే పరిశోధనలకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. "దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్లకు సాధ్యమయ్యే పరిష్కారాలను కనుగొనే దిశగా ఈ అధ్యయనం ఒక అడుగు," అని ఆయన అన్నారు.
ఈ పరిశోధనను పీర్ రివ్యూడ్ సైంటిఫిక్ జర్నల్లో ప్రచురించడం జరిగింది.
ఏదేమైనా.. చికున్‌గున్యాకు చికిత్సగా ఎఫావిరెంజ్ని ఐఐటీ రూర్కీ పరిశోధకులు ధ్రువీకరించలేదు. రోగుల్లో చికున్‌గున్యా చికిత్సకు దాని భద్రత- ప్రభావాన్ని అంచనా వేయడానికి అదనపు అధ్యయనాలు, క్లినికల్ ట్రయల్స్ అవసరమని ఐఐటి రూర్కీ పేర్కొంది.
సంబంధిత కథనం