IIIT-Delhi Placements 2024: ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ ఐఐఐటీ ఢిల్లీ ప్లేస్మెంట్స్ 2024 సీజన్ ను ముగించింది. ఈ ఏడాది 548 ఫుల్ టైమ్ పోస్టులు, 129 ఇంటర్న్ షిప్ అవకాశాలతో కలిపి మొత్తం 677 జాబ్ ఆఫర్లు వచ్చాయి. క్యాంపస్ సగటు వేతనం రూ.20.46 లక్షలు. ఈ ఏడాది రెగ్యులర్ టాప్ టైర్ రిక్రూటర్లు, మిడ్-సెగ్మెంట్ సంస్థలు, స్టార్టప్స్ సహా 113 కంపెనీలు ఐఐఐటీ ప్లేస్మెంట్ డ్రైవ్ లో పాల్గొన్నాయి. ఓవరాల్ ప్లేస్ మెంట్ శాతం 85.98 శాతంగా ఉంది. బీటెక్ ప్లేస్ మెంట్ శాతం 84 శాతం, ఎంటెక్ ప్లేస్ మెంట్ శాతం 89 శాతంగా ఉంది.
ఈ సంవత్సరం ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ విద్యార్థులకు అంతర్జాతీయంగా లభించిన అత్యధిక వార్షిక వేతనం రూ.95.15 లక్షలుగా ఉంది. డొమెస్టిక్ కంపెనీ నుంచి వచ్చిన అత్యధిక వార్షిక వేతనం రూ. 49 లక్షలుగా ఉంది. అలాగే, రూ.30 లక్షల వార్షిక వేతనం కన్నా ఎక్కువ సీటీసీతో 78 మంది విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయి. 9 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్లు లభించాయి.
ఐఐఐటీ-ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రంజన్ బోస్ మాట్లాడుతూ, "మన విద్యార్థులు పొందే నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధికి ఈ సంవత్సరం వచ్చిన అద్భుతమైన ప్లేస్మెంట్ ఫలితాలు నిదర్శనం. సవాళ్లతో కూడిన ఆర్థిక వాతావరణం ఉన్నప్పటికీ, మా గ్రాడ్యుయేట్లు ఉన్నత స్థాయి స్థానాలను సాధించారు. ఇది వారి సామర్థ్యానికి, మా సంస్థపై పరిశ్రమకు ఉన్న నమ్మకానికి నిదర్శనం’’ అన్నారు.