Rahul Gandhi: “ఒకవేళ మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే..”: అమెరికాలో రాహుల్ గాంధీ-if you sat modi down next to god says rahul gandhi in us event ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  If You Sat Modi Down Next To God Says Rahul Gandhi In Us Event

Rahul Gandhi: “ఒకవేళ మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే..”: అమెరికాలో రాహుల్ గాంధీ

Chatakonda Krishna Prakash HT Telugu
May 31, 2023 12:32 PM IST

Rahul Gandhi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీపై అమెరికా వేదికగా విమర్శలు చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. తమనే అన్నీ తెలుసని కొందరు అనుకుంటుంటారు అని అన్నారు.

ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ
ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ (HT_PRINT)

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా సాన్ ఫ్రాన్సిస్కోలో బుధవారం.. అక్కడి భారతీయులతో మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన ఈవెంట్‍లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులపై విమర్శలు చేశారు. ఒకవేళ మోదీని దేవుడి పక్కన కూర్చొబెడితే.. ఈ విశ్వం ఎలా పని చేస్తోందని దేవుడికే మోదీ వివరిస్తారని రాహుల్ అన్నారు. తమకే అంతా తెలుసని అందరినీ నమ్మిస్తున్న కొందరు భారత దేశాన్ని ప్రస్తుతం నడుపుతున్నారంటూ రాహుల్ విమర్శలు చేశారు. మరిన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

“నాకు తెలిసి ఒకవేళ మోదీజీ మీరు దేవుడు పక్కన కూర్చుంటే… ఈ సమస్త విశ్వం ఎలా పని చేస్తోందని దేవుడికే మోదీ వివరించడం ప్రారంభిస్తారు. ఈ విశ్వాన్ని తానే కదా సృష్టించిందని అప్పుడు దేవుడే తికమక పడతాడు. ఇది సరదాగా అనిపించవచ్చు.. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. తమకు అన్నీ తెలుసని, అర్థమవుతాయని ఓ గ్రూప్ వారు అనుకుంటున్నారు. వారు సైంటిస్టులకు సైన్స్‌ను, చరిత్రకారులకు హిస్టరీని, ఆర్మీకి రక్షణ గురించి చెబుతున్నారు. అసలు వాస్తవం ఏంటేంటే ఆ గ్రూప్ వారు ఏదీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఏమీ వినేందుకు సిద్ధంగా లేని వారు.. ఏమీ అర్థం చేసుకోలేరు” అని రాహుల్ గాంధీ అన్నారు. ఒకవేళ దేవుడు పక్కన కూర్చున్నా ఆయన మాటలు కూడా వినకుండా.. దేవుడికే మోదీ వివరిస్తారని రాహుల్ అన్నారు.

ఆ సమస్యలపై మాట్లాడరెందుకు?

దేశంలోని నిరుద్యోగం, ధరల పెరుగుదల, నాసిరకం విద్యావ్యవస్థ, పెరుగుతున్న విద్వేషం సమస్యలపై ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. “బీజేపీ నిజంగా ఈ విషయాలపై చర్చించదు. మీకు (మోదీ) సాష్టాంగ పడడం తెలుసు. నేను సాష్టాంగం చేయనందుకు మీకు సంతోషంగా లేదా” అని రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటు కొత్త భవనంలో ఏర్పాటు చేసిన సెంగోల్‍కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కరం చేయడం గుర్తించి రాహుల్ ప్రస్తావించారు.

యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు

తాను చేసిన భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించిందని రాహుల్ గాంధీ అన్నారు. దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేసి కొందరిని బెదిరించిందని కూడా ఆరోపించారు. అయితే ఏదీ పని చేయలేదని, యాత్ర ప్రభావం పెరిగిందని అన్నారు.

గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 30న జమ్ములోని శ్రీనగర్‌లో యాత్రను ముగించారు. సుమారు 3,000 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు రాహుల్.

WhatsApp channel