రాజస్తాన్ లో సంచలనం సృష్టించిన ఐబీ అధికారి హత్య కేసులో ఝలావర్ కోర్టు తీర్పు వెలువరించింది. హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి భార్యను, ఆమె ప్రియుడిని ప్రధాన దోషులుగా నిర్ధారించింది. ఆ ఇద్దరికి, వారికి సహకరించిన ఇతరులకు జైలు శిక్ష విధించింది. ఆ ఐబీ అధికారి భార్య ప్రియుడు రాజస్తాన్ లో పోలీసు అధికారి కాగా, అతడిని డిపార్ట్మెంట్ విధుల్లో నుంచి సస్పెండ్ చేసింది.
ఈ హత్య కేసులో దోషులుగా తేలిన సస్పెన్షన్ కు గురైన రాజస్థాన్ పోలీసు అధికారికి యావజ్జీవ కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించగా, ఐబీ అధికారి భార్య, మరో దోషికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
న్యూఢిల్లీలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చేతన్ ప్రకాశ్ గలావ్ మృతదేహం 2018 ఫిబ్రవరిలో ఝలావర్ లోని రాలేటాలోని రైల్వే స్టేషన్ లో లభ్యమైంది. తొలుత సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తరువాత ఆ ఐబీ అధికారి తండ్రి అభ్యర్థన మేరకు దర్యాప్తు చేసి హత్య కేసుగా నిర్ధారించారు.
పోలీసులు కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూఢిల్లీలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చేతన్ ప్రకాశ్ గలావ్ భార్య అనితా మీనా. ఆమె ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. ఆమెకు రాజస్తాన్ పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ప్రవీణ్ రాథోడ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ కలిసి చేతన్ ప్రకాశ్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తమకు సహకరించడం కోసం స్థానిక ఆర్టీవో ఏజెంట్ షారుక్ ఖాన్ కు రూ. 3 లక్షలు ఇచ్చారు. ఈ హత్యలో వారికి సంతోష్ నిర్మల్ అనే ప్రైవేట్ మెడికల్ నర్సు, మరో నిందితుడు ఫర్హాన్ కూడా సహకరించారు. వీరంతా కలిసి చేతన్ ప్రకాశ్ హత్యకు పథకం రూపొందించి, అమలు చేశారు.
హత్య జరిగిన నాలుగు నెలల తర్వాత షారూఖ్ ఖాన్ పోలీసులు ను అరెస్టు చేయడంతో గాలవ్ హత్య వెనుక ఉన్న మిస్టరీ బట్టబయలైంది. నర్సు సంతోష్ నిర్మల్, ఫర్హాన్ లతో కలిసి ఝలావర్ రైల్వే స్టేషన్ నుంచి చేతన్ ప్రకాశ్ ను అపహరించి, డబుల్ డోస్ కెటమైన్ ఇంజెక్షన్ చేసి అతడిని చంపేశామని షారూఖ్ ఖాన్ పోలీసులకు తెలిపాడు.
సంబంధిత కథనం